శంకుస్థాపనలు చేసి చంద్రబాబులా వదిలేయం

Dec 16,2023 21:22

 ప్రజాశక్తి-భోగాపురం :  చంద్రబాబులా శంకుస్థాపనలు చేసి వదిలేయడం తమకు తెలీదని వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్యెల్యేలతో కలిసి పరిశీలించారు. అనంతరం విమానాశ్రయ ప్రాంతంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు వలె ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసి ఓట్లు దండుకోవడం తమకు తెలియదన్నారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రతి ప్రాజెక్టూ నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఉత్తరాంధ్రంలో అనేక ప్రాజెక్టులకు జగన్‌మోహన్‌ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. 25 నుంచి 30 నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి.. జిఎంఆర్‌ సంస్థకు సూచించారని వెల్లడించారు. అందుకు అనుగుణంగా వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ అవినీతికి చోటు లేకుండా విమానాశ్రయ భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు. కేవలం కావాలనే ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని కొట్టిపారేశారు. ముందుగా విమానాశ్రయ పనులను ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. రన్‌వే, టెర్మినల్‌, పరిపాలన విభాగం భవనాల నిర్మాణాలకు సంబంధించిన వివరాలను జిఎంఆర్‌ సంస్థ ప్రతినిధి రామరాజు మ్యాప్‌ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్‌పిలు బెల్లాన చంద్రశేఖర్‌, ఎం.వి.వి సత్యనారాయణ, ఎమ్మెల్యేలు ధర్మాన క్రిష్ణదాస్‌, బొత్స అప్పలనర్సయ్య, కళావతి, ఆదీప్‌రాజ్‌, కంబాల జోగులు, అలజంగి జోగారావు, ఆర్‌డిఒ సూర్యకళ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఉప్పాడ శివారెడ్డి, మాజీ జెడ్‌పిటిసి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

➡️