సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉధృతం

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె ఉధృతం

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌సమగ్ర శిక్షాభియాన్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మె కాకినాడలో మూడో రోజుకి చేరుకుంది. ఇంద్రపాలెం అంబేద్కర్‌ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా జగన్‌ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్‌ చేస్తానన్న హామీని అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 4 నెలల పెండింగ్‌ వేతనాలు తక్షణం చెల్లించాలని, పిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని నినాదాలు చేశారు. మానవహారం సందర్భంగా పోలీసులు నిరోధించే ప్రయత్నం చేయగా పోలీసులు, ఉద్యోగులు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌ కలుగజేసుకొని శాంతియుతంగా సమ్మె చేస్తున్న వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించవద్దని పోలీసులకు హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వంతో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజ్యాంగం ప్రకారం పోరాడుతున్న సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలని, తక్షణం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో సిఐటియు అనుబంధ సంఘాలను, అఖిలపక్ష కార్మిక సంఘాలను కలిపి సమ్మె ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. సమ్మె శిబిరానికి ఎపి అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుబండి చంద్రవతి, యుటిఫ్‌ నగర నాయకులు రమణ, ధర్మరాజు, మహేష్‌, రవి శ్రీనివాస్‌, ఎంఇఒల సంఘం నాయకులు పి.కృష్ణవేణి, ఎన్‌.గణేష్‌ బాబు, కె.వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జల్లూరి వెంకటేశ్వరులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు ఎం.చంటిబాబు, ఎ.లోవరాజు, నారాయణ, గంగాధర్‌, నాగమణి, సుబ్రమణ్యం, తారక్‌ పాల్గొన్నారు.

➡️