సమస్యలపై దశలవారీ పోరాటాలు

సమావేశంలో మాట్లాడుతున్న బందగీ సాహెబ్‌
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఎ) సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని విఆర్‌ఎల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు షేక్‌ బందగీ సాహెబ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంఘం సత్తెనపల్లి డివిజన్‌ కమిటీ సమావేశం స్థానిక పుతుంబాక వెంకటపతి భవన్‌లో మంగళవారం జరిగింది. బందగీ సాహెబ్‌ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక విఆర్‌ఎల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కరించలేదన్నారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో విఆర్‌ఎల సమస్యలను పరిష్కరిస్తామని ప్రతిపక్ష నేతగా హామీనిచ్చిన జగన్‌ ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకపోగా పోరాటాల ద్వారా సాధించుకున్న డిఎను నిలిపేశారని, రికవరీ పేరుతో రూ.కోట్లను విఆర్‌ఎల నుండి అక్రమంగా వసూలు చేశారని మండిపడ్డారు. సమస్యలపై పోరాడుతుంటే పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున నిర్బంధం విధిస్తున్నారని విమర్శించారు. డిఎ రూ.500 ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించి నాలుగు నెలలైనా ఇంత వరకు జీవో ఇవ్వలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో దశలవారీ పోరాటాలకు విఆర్‌ఎలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. గురువారం అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద, 28న కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహి స్తామని, జనవరి 5న మంగళగిరి సిపిఎల్‌ఎ కార్యాలయం వద్ద మహాధర్నా చేస్తామని ప్రకటించారు. సమావేశంలో సత్తెనపల్లి డివిజన్‌ అధ్యక్షులు పి.సంజీవరావు, కార్యదర్శి సుబ్బారావు, క్రోసూరు, రాజుపాలెం, అమరావతి, బెల్లంకొండ, నకరికల్లు, సత్తెనపల్లి మండలాల అధ్యక్షులు దినేష్‌, సిద్దయ్య, కోటేశ్వరరావు, సుందర్‌రావు, కాసులు, రవి, ముప్పాళ్ల మండల నాయకులు గన్‌సైదా, సరిత, నాయకులు శ్రీకాంత్‌, యాకోబు, శ్రీను, రాజు, జానమ్మ, వనజ, బేబీ, ముస్తఫా, బ్రహ్మయ్య, దేశపతి పాల్గొన్నారు.

➡️