సమస్యలు పరిష్కరించని సిఎం జగన్‌

చెవిలో పువ్వులతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల ర్యాలీ

ప్రజాశక్తి – ముమ్మిడివరం

తమ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పిన సిఎం జగన్‌ నాలుగున్నరేళ్లు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎయిమ్స్‌ కళాశాల్లోని జిల్లా కార్యాలయాల ప్రాంగణంలో రాష్ట్ర జెఎసి పిలుపు మేరకు నిరవధిక ఎస్‌ఎస్‌ఎల సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది.ఈ సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ మరియు పార్ట్‌ టైమ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ లో పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను రెగ్యులైజ్‌ చేస్తామని చెప్పి తీరా సిఎం అయ్యాక చెవిలో పువ్వులు పెట్టి మోసం చేశారని ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు జెఎసి ఆవేదన వ్యక్తంచేసింది. ఇప్పటికైనా తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, పిఆర్‌సి వర్తింప చేయాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసనకు ముందుగా స్థానిక ఎంపిడిఒ కార్యాలయం నుంచి వచ్చిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకుని మాజీ సిఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందించి, ర్యాలీ నిర్వహిం చారు. వీరికి సిఐటియు జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్‌, ఎస్‌టియు, యుటిఎఫ్‌, ఎంఇఒల సంఘాలతో పాటు కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ నిరసనలో సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

 

➡️