సమస్యలు పరిష్కారంలో కాలయాపన తగదు

Mar 28,2024 20:51

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారంలో కాలయాపన తగదని మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి. రమణ అన్నారు. గురువారం స్థానిక ఆర్‌ఒబి వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరశన పోరాటం 57వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా టివి రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ శిబిరంలో మాట్లాడుతూ ఉద్యోగులు, కార్మికులు 7డిఎ బకాయిలు చెల్లించాలని, 2019 నుంచి వేతన ఒప్పందం చేయాలని, వేధింపులు, బదిలీలు ఆపాలని కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని 57రోజులుగా నిరశన పోరాటం చేస్తుంటే యాజమాన్యం చర్చల పేరిట కాలయాపన చేయడం తగదన్నారు. గురువారం జరిగిన చర్చల్లో మిమ్స్‌ యాజమాన్యం 7శాతం డిఎ ఇవ్వడానికి అంగీకారం తెలిపి, వేతన ఒప్పందం కొత్త నిబంధనల ప్రకారం చేస్తామని అది కూడా ఏప్రిల్‌ నెల నుంచి ఇస్తూ ఆగస్టులో అగ్రిమెంట్‌ చేస్తానని చెప్పడం భావ్యం కాదన్నారు. ముందు వేతన ఒప్పందం అగ్రిమెంట్‌ చేయాలని కొత్త వేతన ఒప్పందం ప్రకారం పెరిగిన వేతనాలు ఆగస్టు నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఉద్యోగులు, కార్మికులు చేసిన నిరశన పోరాట కాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సస్పెండ్‌ చేసిన ఉద్యోగులను విధుల్లోకి యాజమాన్యం తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. ఈ చర్చలు గురువారంతోపాటు శుక్రవారం కూడా కొనసాగుతాయన్నారు. ఈ శిబిరంలో మిమ్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.నారాయణ, ఉద్యోగులు కె. కామునాయుడు, కె.మధు, ఎం.నాగభూషణం, గౌరీ, వరలక్ష్మి, బి. బంగారునాయుడు మూర్తి, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️