సమస్యాత్మక నియోజకవర్గాలలో మాచర్లది ప్రత్యేక స్థానం

Mar 22,2024 23:13

కారంపూడిలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న జెసి
ప్రజాశక్తి – మాచర్ల, కారంపూడి :
జిల్లాలోని సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాచర్ల అతి సమస్యాత్మకమని జాయింట్‌ కలెక్టర్‌, నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎ.శ్యాంప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రమైన కారంపూడిలోని జెడ్‌పి పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను జెసి శుక్రవారం తనిఖీ చేశారు. మాచర్లకు వచ్చి స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో 299 పోలింగ్‌ కేంద్రాలుండగా, వీటిల్లో 144 కేంద్రాలు సమస్యాత్మకమైనవని చెప్పారు. వీటిల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వెబ్‌క్యాస్టింగ్‌, ఎక్కువ సంఖ్యలో పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల నిబంధనా వళి అమలుపై ప్రతిరోజూ పరిశీలిస్తున్నామని, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు, నిబంధనలకు విరుద్ధంగా అంటించిన ఫొటోలను తొలగించామని తెలిపారు. పెద్ద,పెద్ద నిర్మాణాలపై ఉన్న పార్టీ రంగులను పూర్తిగా తొలగించేందుకు అవకాశం లేకపోవటంతో దానిలో ఒక రంగును చెరిపివేయటం, మరో రంగును చేర్చటం వంటి మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలు ప్రచారం చేసుకోవచ్చని, సువిధ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని, అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అన్ని పర్మిషన్లు ఆర్‌ఓ కార్యాలయం ద్వారానే జరుగుతాయన్నారు. ఇతర శాఖలతో కూడా ఇక్కడ నుండే చర్చించి పార్టీ నాయకులు పెట్టుకున్న దరఖాస్తుపై తుది అనుమతి ఇస్తామని తెలిపారు. ఆయా పార్టీల ప్రతినిధుల నుండి ఎన్నికల నిబంధలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై 150 ఫిర్యాదులు అందాయని, వీటిని పరిశీలించామని తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో నాలుగు రోజులుగా వరసగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, మంగళవారం టిడిపి పార్టీకి చెందిన వారి కారు దహనం చేయగా ఈ కేసులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. గురువారం రాత్రి జనసేన పార్టీ నాయకులపై దాడి, వాహనాన్ని ధ్వంసం చేశారని, మాచర్లలోని 8వ వార్డులో మరో వాహనాన్ని దహనం చేశారని చెప్పారు. దుర్గి మండలంలో జరిగిన సంఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మాచర్లలో బోలేరో వాహన దహనం సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. శాంతి, భద్రతల విషయంలో కఠినంగా వ్యహరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎవరైనా సమస్యలపై తమకు సమాచారం ఇవ్వొచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 2,60,533 మంది ఓటర్ల నమోదవగా వీరిలో పురుషులు 1,27,727, స్త్రీలు 1,32,784, ట్రాన్స్‌ జెండర్‌ 22 మంది ఉన్నట్లు తెలిపారు. ఎక్కువ సిసి కెమోరాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎన్నికల నియమావళి ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలపై పటిష్టమైన నిఘా ఏర్పాటుకు ఆదేశించారు. జెసివెంట ఎంపిడిఒ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ రామాంజనేయులు, తహశీల్దార్‌, విఆర్‌ఒలు, బిఎల్వోలు ఉన్నారు.

➡️