సమానత్వం కోసం పోరాడాలి : ఐద్వా

Mar 13,2024 21:56

సభలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి
ప్రజాశక్తి-తాడేపల్లి :
సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు పురుషులతో పాటు సమానత్వం కోసం కృషి చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రకాష్‌నగర్‌ సిఐటియు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. సభకు అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు తబిత అధ్యక్షత వహించారు. రమాదేవి మాట్లాడుతూ వేతనాల విషయంతో పాటు ఒకే పని చేస్తున్న అనేక రంగాల్లో నేటికీ మహిళలకు, పురుషులకు వ్యత్యాసం చూపిస్తున్నారని అన్నారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, దౌర్జన్యాలు ఇటీవల కాలంలో పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో మహిళలపై అదేస్థాయిలో దాడులు కూడా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు పని గంటల పోరాటంలో ముందుండి ఎనిమిది గంటలు పని దినాలు సాధించడంలో అగ్రభాగాన నిలిచారని కొనియాడారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత సమస్యలపైనా పోరాడాలన్నారు. ఇటీవల జరిగిన అంగన్‌వాడీ పోరాటంలో చూపిన తెగువ, ధైర్యం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు డి.శ్రీనివాసకుమారి, పట్టణ కార్యదర్శి పి.గిరిజ, అంగన్‌వాడీలు సుజాత, కోటేశ్వరమ్మ, శశిరాణి పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న రమణ
ప్రజాశక్తి-గుంటూరు :
స్థానిక ఇన్నర్‌ రింగురోడ్డులోని ప్రగతి నగర్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఐద్వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక మహిళా సంఘం సభ్యులు ఐద్వా జెండా ఆవిష్కరించారు. ఐద్వా నగర అధ్యక్షులు జి.రమణ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నా, చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం ఉండట్లేదని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదిస్తూనే 2029 సంవత్సరం నుంచి అమలు పరుస్తామని చెప్పటం మహిళలను మోసం చేయడమే అవుతుందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నాయకులు కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోయాయని, మహిళా స్వేచ్ఛను హరిస్తూ మహిళా సాధికారత కోసం మా ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా ప్రగతినగర్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఓబులేశ్వరి, ఫాతిమా బేగం, సుహాసిని, కుమారి, సూర్యకుమారి, కోటేశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.

➡️