సమ్మెలోకి మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు

నరసరావుపేటలో సమ్మె శిబిరం
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు మంగళవారం సమ్మె ప్రారంభించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని యూనియన్‌ పల్నాడు జిల్లా గౌరవాధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌ ప్రారంభించి మాట్లాడారు. సమస్యలపై కొన్ని నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పరిష్కరించని నేపథ్యంలో అనివార్యంగా సమ్మెకు దిగినట్లు చెప్పారు. కార్మికులకు ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను విస్మరించారని, కరోనా సమయంలో మున్సిపల్‌ కార్మికులు చేసిన సేవలు వెలకట్టలేని అని కీర్తించినా నామమాత్రపు జీతాలతో ఎలా బతుకుతారో మాత్రం ఆలోచించడం లేదని అన్నారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌ మాట్లాడుతూ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్‌ చేయాలని, కారుణ్య నియామకాలు, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని కోరారు. క్లాప్‌ వాహన డ్రైవర్లకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ,కార్మికులకు భద్రతా పరికరాలు యూనిఫామ్‌, సబ్బులు, చెప్పులు, నూనె ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు యోహన్‌, పి.యేసు, మల్లయ్య, నరసింహారావు, అల్లాబక్షు, శేఖర్‌, సింగ్‌, వెంకట్‌, మహేష్‌, దీనమ్మ పాల్గొన్నారు.ప్రజాశక్తి-సత్తెనపల్లి : సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఔట్సోర్సింగ్‌, కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న తమను పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్రవ్యాప్త పిలుపుమేరకు మంగళవారం నుండి సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా సత్తెనపల్లిలో కార్మికులు విధులు బహిష్కరించి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శిబిరాన్ని సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయనాయక్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. క్లాప్‌ ఆటోల డ్రైవర్లకు కనీస వేతనం రూ.18500 ఇవ్వాలని, పర్మినెంట్‌ సిబ్బందికి సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి వి.చంద్రకళ, సత్తెనపల్లి అధ్యక్షులు సిహెచ్‌.పెదవెంకయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి హరిపోతురాజు, కార్మికులు జె.నాగమణి, జె.రమేష్‌, వి.కోటేశ్వరమ్మ, స్టీఫెన్‌, జి.శ్రీను, కె.సుబ్బులు, సునీత, డి.కోటేశ్వరి పాల్గొన్నారు.ప్రజాశక్తి – మాచర్ల : స్థానిక మున్సిపల్‌ కార్యాలయం సమీపంలో కార్మికులు సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని సిఐటియు నాయకులు బండ్ల మహేష్‌ ప్రారంభించి మాట్లాడారు. కార్మికులకు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యూటీ, సగం జీతం పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో కార్మికులు సమ్మెకు పూనుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు కె రమణ, అనసూయ, బి.చిన్నమ్మాయి, లక్ష్మీదేవి, డి.రమణ, ఇస్సాకు, ఆంజమ్మ, మల్లమ్మ పాల్గొన్నారు.ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక ఐలాండ్‌ సెంటర్లోని ఏడుకొట్ల సెంటర్‌ వద్ద సమ్మె శిబిరాన్ని సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడారు. కార్మికులను పర్మినెంట్‌ చేస్తామంటూ ప్రతిపక్షంలో ఉండగా హామీనిచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు విస్మరించారని విమర్శించారు. కనీస వేతనం రూ.26 ఇవ్వాలని, ప్రమాదకరంగా మారిన ఆప్కాస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం దిగొచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని, ప్రజలకు పారిశుధ్య సమస్యలు తలెత్తితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు కె.సీతారామయ్య, ఎం.ప్రతాప్‌, ఏరమ్మ, సుజాత, పి.సురేంద్ర, ఆర్‌.శ్రీను, కె.వెంకటమ్మ, అనంతలక్ష్మి, డి.లక్ష్మి, కొండలు, మార్తమ్మ పాల్గొన్నారు.

➡️