విపత్తుల పట్ల అప్రమత్తం – హోంమంత్రి వంగలపూడి అనిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో తుపాను, భారీ వర్షాలు, పిడుగుల పట్ల అప్రమత్తంగా వుండాలని అధికారులను హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయానికి మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం వెళ్లారు. కార్యాలయంలోని ఎమర్జెన్సీ అలర్ట్‌ కేంద్రాన్ని సందర్శించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి నుండే ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, డిఆర్‌ఒలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ.. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా వుంచాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండాలన్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు మంత్రి దృష్టికి అధికారులు తెచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో అత్యధికంగా 184 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. భారీ వర్షాల వల్ల సంభవించే పరిస్థితులపై అధికారులను అప్రమత్తం చేస్తున్నామని వివరించారు. నాసిక్‌, భద్రాచలం వంటి ప్రాంతాల్లో వర్షాలు, వరదల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని గోదావరి తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తామన్నారు. అనంతరం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్‌ క్యాంపును మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విపత్తుల నిర్వహణశాఖ ఇడి సి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️