సమ్మె ఒప్పంద హామీలు అమలు చేయాలి

Feb 12,2024 00:31

సమావేశంలో మాట్లాడుతున్న దీప్తి మనోజ
ప్రజాశక్తి-గుంటూరు :
అంగన్వాడీల సమ్మె విరమణ సందర్భంగా జరిగిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్లకు సంబంధించిన జిఒలు వెంటనే విడుదల చేయానలి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక పాతగుంటూరు సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎవిఎన్‌.కుమారి అధ్యక్షతన యూనియన్‌ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు 42 రోజులు పాటు నిరవధికంగా సమ్మె నిర్వహించామని, సమ్మె ముగిసి మూడు వారాలైనా నేటికీ ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన జీవోలు విడుదల కాలేదన్నారు. ముఖ్యంగా సమ్మె కాలం జీతం జీవో ఇవ్వలేదన్నారు. అంత్యక్రియల ఖర్చులకు సంబంధించిన జీవో, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ పెంపుదల తదితర అన్ని జీవోలను తక్షణమే జారీ చేయాలని కోరారు. ఒప్పందంలో భాగంగా కొన్ని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న త్రైపాక్షిక కమిటీని కూడా వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో హెల్పర్ల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని దీనివల్ల సెంటర్ల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఖాళీలన్నింటినీ నెలరోజుల్లోగా భర్తీకి జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా నాయకులు టి.రాధ, సుకన్య, ప్రేమలత, నిర్మల జ్యోతి పాల్గొన్నారు.

➡️