సమ్మె జీవోలు విడుదల చేయాలి

Feb 6,2024 21:21

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : సిఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత 16 రోజులుగా సమ్మె చేపట్టగా, మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌, సిఐటియు నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో అధికారులు ప్రకటించిన హామీలకు తక్షణమే జిఒలను విడుదల చేయాలని యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎన్‌.శంకర్రావు, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ కేశవ నాయుడుకు యూనియన్‌ నాయకులు, కార్మికులు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం శంకర్రావు, వెంకట రమణ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాపోయారు. సమ్మె ముగింపు రోజు జరిగిన ఒప్పందాల మేరకు జీవోలను రెండూ లేదా మూడు రోజుల్లోనే జారీ చేస్తామని గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌, అధికారులు హామీ ఇచ్చారన్నారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ జీతాల చెల్లింపు విషయమై అధికారుల కమిటీ నివేదికను జనవరి నెలాఖరులోగా నివేదిస్తామన్నారన్నారు. అలాగే క్లాప్‌ డ్రైవర్లకు చట్టబద్ధమైన జీత భత్యాలు చెల్లింపు విషయమై జనవరి నెలాఖరులోపు జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని అంగీకరించారని వాటిని పూర్తిగా మరిచారని విమర్శించారు. క్లీన్‌ ఎన్విరాన్మెంట్‌ వర్కర్స్‌కు సంబంధించి రూ.21 వేలు, శానిటేషన్‌ డ్రైవర్లు, విలీన గ్రామపంచాయతీ కార్మికులను మున్సిపల్‌ కార్మికులుగా గుర్తించి రూ.21వేలు జీతం, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.75వేలు, దహన సంస్కారాలకు రూ.20వేలు, ఎక్స్‌ గ్రేషియో సాధారణ మృతికి రూ.2 లక్షలు, ప్రమాద మృతులకు రూ.5 నుంచి రూ.7లక్షలకు పెంపు, పర్మినెంట్‌ సిబ్బందికి సంబంధించి రూ.20 కోట్లుకు పైగా బకాయి ఉన్న సరెండర్‌ లీవులు చెల్లింపులు, జిపిఎఫ్‌ అకౌంట్లు ప్రారంభం, క్లీన్‌ ఎన్విరాన్మెంట్‌ వర్కర్స్కు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు తదితర జిఒలను నేటికీ జారీ చేయకపోవడం శోచనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన విడనాడి తక్షణమే జీవోలు జారీ చేయాలని, అంగీకార ఒప్పందాల మేరకు తక్షణమే ఇంజనీరింగ్‌ కార్మికులు, క్లాప్‌ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మరో పోరాటానికి సన్నద్ధం కానున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌ సింహాచలం, ఎం.శివ, ఎన్‌.మలేష్‌, నిర్మల, ఐ.శ్రీకాంత్‌, టి.జాన్‌, పి. రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️