సమ్మె విరమించేది లేదు

Jan 17,2024 23:40
తమ సమస్యలను

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ సమస్యలను పరిష్కరించే వరకూ నిరవధిక సమ్మెను విరమించబోమని అంగన్‌వాడీలు స్పష్టం చేశారు. నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ప్రభుత్వం జిఒ నెంబర్‌ 2ని విడుదల చేసింది. అనంతరం పది రోజుల్లోపు విధులకు హాజరుకావాలని సంబంధిత శాఖ అధికారుల ద్వారా షోకాజ్‌ నోటీసులను అంగన్‌వాడీలకు అందించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు సమాధానంగా బుధవారం జిల్లాలోని పలు కేంద్రాల్లో అంగన్‌వాడీలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఐసిడిఎస్‌ కార్యాలయాల్లో అధికారులకు ప్రభుత్వ షోకాజ్‌ నోటీసులకు లిఖితపూర్వకంగా సమాధానాలను ఇచ్చి వారి నుంచి నకలును తీసుకున్నారు.

కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో డైరీ ఫామ్‌ సెంటర్‌ నుంచి ఐసిడిఎస్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు సమాధానాన్ని లిఖితపూర్వకంగా..వ్యక్తిగతంగా అందించి, వారి నుంచి నకలును తీసుకున్నారు. ముందుగా సమ్మె శిబిరాన్ని 37వ రోజైన బుధవారం నాడు సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ ప్రారంభించి మాట్లాడారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో తమ వద్ద డబ్బు ఉన్నా వేతనాలను పెంచమని చెప్పడం ద్వారా ప్రభుత్వం తన మొండితనాన్ని నిరూపించుకుందని అన్నారు. ఐదేళ్లకోసారి వేతనాలు పెంచాలనే పాలసీని నిర్ణయించుకున్నామని చర్చలకు వచ్చిన మంత్రులు, అధికారులు చెప్పడం శోచనీయమన్నారు. ఐదేళ్లకోసారి వేతతాన్ని పెంచితే నిత్యవసర సరుకులు, ఇతర ధరలను కూడా ఐదేళ్లకు ఒకసారి పెంచుతారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లకు ఒకసారి వేతనాలు పెంచదలిస్తే అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా అని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు, ఇతర బెనిఫిట్‌లు కూడా అంగన్‌వాడీలకు వర్తింప చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కాకినాడ నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జి.రమణమ్మ, రమ, నీరజ, మున్ని, రాజేశ్వరి, బాంధవి, సరోజ, విజయ, రమ తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం స్థానిక మున్సిపల్‌ సెంటర్లోని సమ్మె శిబిరం నుంచి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వరకూ అంగన్‌వాడీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు సమాధానాలను లిఖితపూర్వకంగా ఐసిడిఎస్‌ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ కార్యదర్శి దాడి బేబీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను రిజిష్ట్రార్‌ పోస్టుల ద్వారా, గోడలకు అంటించడం ద్వారా సమాచారం అందిం చారన్నారు. వీటికి తాము ప్రదర్శనగా వెళ్లి సమాధానాలు అందజేశామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, ఎపి అంగన్‌వాడీ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, ఇ.చంద్రావతి, సిఐటియు నాయకులు క్రాంతికుమార్‌, గడిగట్ల సత్తిబాబు, టి.నాగమణి, అమలావతి, ఎస్తేరు రాణి, తదితరులు పాల్గొన్నారు.

ఏలేశ్వరం స్థానిక సమ్మె శిబిరం నుంచి సెక్టార్‌ కార్యాలయం వరకూ అంగన్‌వాడీలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు సమాధానాలను లిఖితపూర్వకంగా ఐసిడిఎస్‌ పిఒకు అందచేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషుబాబ్జి, ప్రత్తిపాడు కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, అంగన్‌వాడీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దడాల పద్మ, ఇ.చంద్రావతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించగ పోగా రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కరించకపోతే సమ్మె మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ అధ్యక్షురాలు కాకరపల్లి సునీత, అల్లాడి లక్ష్మి, సిహెచ్‌ హేమలత, యు.మరియ తదితరులు పాల్గొన్నారు.

కోటనందూరు సమ్మెలో ఉన్న అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం రిజిష్టర్‌ పోస్టులో పంపించిన షోకాజ్‌ నోటీసులను పోస్ట్‌మెన్‌ బుధవారం నిరసన శిబిరం వద్ద అందచేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు సమాధానాన్ని గురువారం ఐసిడిఎస్‌ కార్యాలయానికి వెళ్లి పిఒకు అందిస్తామని తెలిపారు. ఈ నిరసన శిబిరంలో యూనియన్‌ నాయకుల ధనలక్ష్మి, సుబ్బలక్ష్మి షకీలా, భాను, దుర్గభవాని, లలిత కుమారి, శ్రీదివ్య, శ్రీదేవి, కుమారి నాయకత్వం వహించారు.

తాళ్లరేవు మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి రాయుడు సునీతకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు పి.ఆదిలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతు సంఘం నాయకులు వళ్లు రాజబాబు పాల్గొన్నారు.

జగ్గంపేట రూరల్‌ స్థానికంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మె శిబిరం నుంచి సిడిపిఒ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులకు సమాధానాలను లిఖితపూర్వకంగా సిడిపిఒ పూర్ణిమకు అందచేశారు. శిబిరం వద్ద జరిగిన కారక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక నిరహారదీక్షకు వెనకాడేది లేదని హెచ్చరించారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మావతి, చంద్రావతి, మండల యూనియన్‌ నాయకులు సుజాత, రాజేశ్వరి, రత్నం, రామ్‌ లీలా, తదితరులు పాల్గొన్నారు.

➡️