సర్వత్రా నిరసన గళం

Dec 20,2023 23:07 #నిరసన గళం
సర్వత్రా నిరసన గళం

రాజమహేంద్రవరం ప్రతినిధి సమస్యల పరిష్కారం కోసం సర్వత్రా నిరసన గళం వినిపిస్తోంది. వేతనాలు అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. భూ హక్కు చట్టం-2023ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఇందులో భాగంగా వారు ధర్నా చేసి నిరసన తెలిపారు. వేతన సవరణ చేయాలంటూ ఎల్‌ఐసి ఉద్యోగులు మధ్యాహ్నాన భోజన సమయంలో ధర్నా చేశారు. మరోపక్క మున్సిపల్‌ ఉపాధ్యాయులు సమస్య పరిష్కారం కోసం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.  నిరవధిక సమ్మెలోకి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు బుధవారం నిరవధిక సమ్మెకు దిగారు. డిఇఒ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు ఉద్యోగులు, సిఆర్‌ఎంటిలకు, ఎంఐఎస్‌, సిఒలకు ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులర్‌ చేయాలని, తక్షణమే గ్రాస్‌ పే, ఎంటిఎస్‌, డిఎ, హెచ్‌ఆర్‌ఎ అమలు చేసి, వేతనం పెంచాలని, పార్ట్‌ టైం ఉద్యోగుల హోదా పెంచి, ఫుల్‌ టైం ఉద్యోగుల విధానాన్ని అమలు చేసి వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని, ఏడాదికి సరిపడా బడ్జెట్‌ ఒకేసారి విడుదల చేయాలని నినదించారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్‌ స్కీములు అమలు పరచాలని, సమగ్ర శిక్షలో పని చేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను, ఉద్యోగ విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని 19 మండలాల నుంచి సుమారు 300 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌జె.త్రినాథ్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మణరావు, యుటిఎఫ్‌ అధ్యక్ష కార్యదర్శులు పి.జయకర్‌, ఎ.షరీఫ్‌, జిల్లా ఉద్యమ నాయకులు డివి.కృష్ణంరాజు, ఎం.రఘునాథ్‌, స్వర్ణాంధ వద్ధాశ్రమం నిర్వాహకులు గుబ్బల రాంబాబు, ఎల్‌ఐసి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సతీష్‌, మునిసిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ధరణి బాబు, కె.శ్రీనివాస్‌ సమ్మెకు సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

➡️