సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల వంటా-వార్పు

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : తమ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద గురువారం దీక్షలు నిర్వహించారు. దీక్షల్లో పాల్గొన్న ఉద్యోగులంతా గాంధీ విగ్రహానికి ఎదురుగా ఉన్న రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. అనంతరం శిబిరం ప్రాంతంలో వంటా-వార్పు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ఉద్యమానికి కెజిబిఎస్‌ ఉద్యోగులు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కెజిబిఎస్‌ ఉద్యోగుల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ శ్రీదేవి, ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వి.పుండరీకాక్ష, కార్యదర్శి ఎల్‌.చైతన్య, గణపతి తదితరులు పాల్గొన్నారు.

 

➡️