‘సాయి బాలాజీ వెంచర్‌లో అక్రమాలు వాస్తవం’

నరసరావుపేట: సాయి బాలాజీ వెంచర్‌ లో ప్రభుత్వ భూమి లేదని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడంపై నరస రావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌-ఛార్జ్‌ డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు విమర్శలు చేశారు. సోమవారం టీడీపీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాయి బాలాజీ వెంచర్‌ లో 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ప్రతి పక్షాలు,ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతుంటే ఎమ్మెల్యే ఏమీ లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.మొదట సాయి బాలాజీ వెంచర్‌ కి తనకు సంబంధం లేదని చెప్పిన ఆయన, ఆదివారం ప్రెస్‌ మీట్‌ లో మాత్రం వెంచర్‌ తనదేనని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వెంచర్లో ప్రభుత్వ భూమి 175 నుంచి 207 మధ్యలో ప్రభుత్వ భూమి,ఇనాం భూముల ఉందని చెప్తే ప్రభుత్వ భూమే లేదని అది ప్రైవేటు వ్యక్తులదని చెప్తున్నారని,ఆ ప్రైవేట్‌ వ్యక్తులకు భూమి ఎలా వచ్చిందో చెప్పాలని నిలదీశారు. వెంచర్లో మొత్తం 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని 183 సర్వే నెంబర్‌ లో 16.47 ఎకరాల ఇనాం భూమి,207లో ఒక ఎకరం ప్రభుత్వ పోరంబోకు భూమి,నోషన్‌ ఖాతా ఇలా అన్ని కలిపి 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ చేసింది ఆరోపణలు కాదని ఆధారాలతో సహా వాస్తవాలను మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేశామని చెప్పారు. గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డికి దమ్ము,ధైర్యం ఉంటే అవినీతి చేయకపోతే సాయి బాలాజీ వెంచర్‌ పై కలెక్టర్‌ తో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్‌ చేశారు. గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి వెంచర్లో చంద్రమౌలేశ్వర స్వామి దేవాలయం భూమి మూడున్నర ఎకరాలు ఉన్నాయని ఒప్పుకున్నారని ఆ భూమి అడంగల్‌ ఎలా నమోదు చేశావో చెప్పాలని ప్రశ్నించారు. ఇనాం భూములకు పట్టాల ఇచ్చారని గోపిరెడ్డి తప్పుడు ఆధారాలు చూపుతున్నారని ఇనాం భూములు ప్రైవేటు వెంచర్లకు ఎలా కలుపుకున్నారో,అ భూముల ఎలా అమ్ముకున్నారో ఆ అధికారం ఎవరిచ్చారో నిలదీశారు. అరవింద బాబు వెంచర్‌ ప్లాను చూపిస్తూ ప్రభుత్వ భూమి వివరాలను మీడియా ముఖంగా ప్రజలకు బహిర్గతం చేశారు.

➡️