సిఎం గారూ.. ఇవీ సమస్యలు.

సిఎం గారూ.. ఇవీ సమస్యలు.

.ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిఎన్నికలు మూడు నెలలు గడువు ఉండగా మరోసారి సిఎం వైఎస్‌.జగన్‌ జిల్లా పర్యటనకు వస్తున్నారు. వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపులో భాగంగా బుధవారం కాకినాడలో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరవుతున్నారు. వైసిపి పాలన మొదలై నాలుగేళ్ల 9 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం ప్రస్తావిస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం కాకినాడ స్మార్ట్‌ సిటీ అభివద్ధి పనుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులను ఏళ్లు తరబడి విడుదల చేయడం లేదు. సుమారు రూ.180 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా జాప్యం చేస్తున్నారు. దీంతో పలు అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. త్వరితగతిన మిగిలిపోయిన నిధులను విడుదల చేసి పనులను పూర్తి చేయాలని నగరవాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు.ఏలేరు ఆధునీకరణకు ఎదురుచూపులుఏలేరు ప్రాజెక్టు సాగు నీటి ఆధారంగా జగ్గంపేట, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లోని దాదాపు 53 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. 40 వేల మంది రైతులు ఆధారపడిన ఏలేరు ఆధునీకరణ పనులు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఫేజ్‌-2లో మిగిలిన 40 శాతం పనుల పూర్తికి రూ.394 కోట్ల నిధులతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఏటా ఈ ఆయకట్టు కింద రైతులు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వైసిపి పాలన మరో మూడు నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో ఈసారైనా తమ సమస్యలను పరిష్కరించాలని రైతాంగం కోరుతోంది. మరోవైపు గత టిడిపి ప్రభుత్వం రూ.160 కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపన చేసినా సుద్దగడ్డ ఆధునీకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పనులు ముందుకు సాగడం లేదు. సుద్దగడ్డ కాలువ ఆధునీకరణ జరిగితే గొల్లప్రోలు, ప్రత్తిపాడు మండలాల్లో సుమారు 25వేల ఎకరాల పంటలు సాగునీరు పుష్కలంగా అందడమే కాక ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.దారుణంగా రహదారులుజిల్లాలో ప్రధాన రహదారుల దుస్థితి దారుణంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1997 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆర్‌ అండ్‌ బి శాఖ రాష్ట్ర రోడ్లు, సుమారు 3 వేల కిలోమీటర్ల మేర జిల్లా రోడ్లు ఉండగా 50 శాతం వరకూ దెబ్బతిన్నాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేలమంది గాయాల పాలవుతున్నారు. ప్రధానంగా కాకినాడ-రాజమండ్రి ఎడిబి రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. సుమారు 60 కిలోమీటర్లు పరిధిలో ఉన్న ఈ రోడ్డులో ఎక్కడ చూసినా మోకాల్లో గుంతలు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఇటీవల పలు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. పిఠాపురం-సామర్లకోట మధ్య రోడ్డుతో పాటు మండపేట వెళ్లే రహదారి, సామర్లకోట నుంచి ద్వారంపూడి మీదగా ధవళేశ్వరం వైపు వెళ్లే రహదారి ఏళ్లు తరబడి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారుల ఆధునీకరణ పనులను త్వరితన చేపట్టి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైనుకు నిధులు నిల్‌కీలకమైన కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను పనులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 21 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం అరకొర నిధులను మాత్రమే విడుదల చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విదల్చడం లేదు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తన వాటా నిధులు ఇవ్వడంతో బాటు కేంద్రంపై ఒత్తిడి పెంచి త్వరితగతిన ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిఎం వైఎస్‌.జగన్‌ నిధుల విడుదలపై ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.పడకేసిన పర్యాటకం కోరంగి మడ అడవులు, హాప్‌ ఐలాండ్‌ కాకినాడ, ఎస్‌.యానాం, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాలు ఇలా అనేక పర్యాటక ప్రదేశాలు ఉమ్మడి జిల్లాకు సొంతం. కానీ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించిన పాపాన పోవడం లేదు. కాకినాడ బీచ్‌ అభివృద్ధి నిలిచిపోయింది. జిల్లా పర్యాటకాభివద్ధిపై గంపెడు ఆశలతో ఉన్న ప్రజలకు జగన్‌ పర్యటన ద్వారా ఊరట లభిస్తుందని ప్రజాప్రతినిధులు ఆశిస్తున్నారు.సబ్‌ ప్లాన్‌ గ్రామాలను గాలికొదిలేసిన సర్కారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్‌ ప్లాన్‌ గ్రామాలను ఐటిడిఎలో విలీనం చేయాలని అనేకేళ్లుగా గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నా జగన్‌ సర్కారు పట్టించుకోవడం లేదు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేక ఇక్కడి గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ గిరిజనుల హక్కులు పూర్తిగా అణచి వేయబడుతున్నాయి. ఇప్పటికైనా సబ్‌ ప్లాన్‌ గ్రామాలను ఐటిడిఎలో విలీనం చేయకపోతే వైసిపి ప్రభుత్వానికి తీవ్ర ప్రతిఘటన తప్పేలా లేదు. సిపిఎం ఆధ్వర్యాన అనేకసార్లు ఆందోళనలు జరిపి, కలెక్టర్‌కు వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️