సిడిపిఒ వ్యాఖ్యలపై అంగన్‌వాడీల ధర్నా

సిడిపిఒ వ్యాఖ్యలపై అంగన్‌వాడీల ధర్నా

ప్రజాశక్తి- తాళ్లరేవుఅంగన్వాడీల సమ్మెపై తాళ్ళరేవు సిడిపిఒ మాధవి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద శుక్రవారం అంగన్వాడీలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. ఇటీవల ఇంజరం అంగన్వాడీ వర్కర్‌ గాలి ఝాన్సీ రత్నకుమారి అనారోగ్య కారణంతో మరణించగా ఆమె గురించి మాట్లాడడానికి శుక్ర వారం వెళ్లిన తమపై సిడిపిఒ మాధవి అనుచిత వ్యాఖ్యలు చేశారని యూనియన్‌ నాయకులు పి.ఆదిలక్ష్మి తెలిపారు. సమ్మెను విరమించి విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయని, సమ్మె విరమించాలని, యూనియన్‌ నాయకులకు జీతాలు వస్తాయి, వాళ్లకు పని ఏముంది, రేపొద్దుట పోయేది మీరే అని బెదిరించారని చెప్పారు. మహిళా సంఘం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.రమణి, భవాని మాట్లాడారు. సిడిపిఒ మాధవి చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలని చెప్పారు. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, కెవిపిఎస్‌ సంఘం నాయకులు టి.ఈశ్వరరావు, వి.రాబాబు, విప్పర్తి శ్రీనివాసరావు, దుప్పి అదృష్టదీపుడు మద్దతు పలికారు.

➡️