సిపిఎం అభ్యర్థిని గెలిపించండి

Mar 19,2024 21:35

ప్రజాశక్తి – కురుపాం / గుమ్మలక్ష్మీపురం : కురుపాం నియోజకవర్గంలో సిపిఎం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బి. శంకర్రావు అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుషుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి ఘర్షణలు గొడవలు సృష్టిస్తున్న మతతత్వ పార్టీ అయిన బిజెపిని, దానికి వంత పాడుతున్న టిడిపి, జనసేన, వైసిపిలను తరిమికొట్టి రానున్న ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం.రమణ, కోలక అవినాష్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.జియ్యమ్మవలస : ప్రజా వ్యతిరేక విధానాలతో, కార్పొరేట్‌ సంస్థలకు జాగీరుగా మారిన బిజెపికి నూకలు చెల్లాయని, అదే పార్టీతో పొత్తుపెట్టుకునే టిడిపి, జనసేన అభ్యర్థిని, వైసిపిని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జియ్యమ్మవలసలో సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఎం మండల కార్యదర్శి కూరంగి సీతారాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, కొల్లి గంగనాయుడు మాట్లాడుతూ అరకు పార్లమెంట్‌, కురుపాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండియా కూటమిలో భాగంగా సిపిఎం పోటీ చేస్తుందని, కావున కార్యకర్తలంతా ముందుండి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టిడిపి, జనసేనలు బిజెపితో పొత్తు పెట్టుకుని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయన్నారు. విభజన హామీలు అమలు చేయని బిజెపితో టిడిపి ఎలా పొత్తు పెట్టుకుంటుందని, ప్రత్యేక హౌదా కానీ, రైల్వే జోన్‌ కానీ, ఉత్తరాంధ్ర ప్యాకేజీ కానీ, అమరావతి రాజధాని కానీ దేనికి నిధులు ఇవ్వని బిజెపితో జతకట్టడమంటే రాష్ట్రానికి అన్యాయం చేయడమేనని అన్నారు. గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలను ఎత్తివేసి గిరిజనుల కొండలన్నీ మైనింగ్‌ పేరుతో కార్పొరేట్‌ పెట్టుబడుదారులకు బిజెపి అప్పజెప్పడానికి చూస్తుందని అన్నారు. గిరిజనులకు ఇస్తామన్న గిరిజన యూనివర్సిటీని ఇంతవరకు ప్రారంభించలేదన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్న పార్టీలను, నాయకులను బిజెపి అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి అరెస్టులు చేస్తున్నారని, ప్రశ్నించే వారిని ఏళ్ల తరబడి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో ఉంచుతున్నారని అన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కూడా ఈ ఐదేళ్ల పాటు బిజెపికి తొత్తుగా వ్యవహరించారని, రాష్ట్ర హక్కులపై బిజెపితో పోరాటం చేయలేదని, ఇప్పుడు కూడా బిజెపిని పళ్లెత్తి మాట అనకుండా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని, ఎలాంటి అభివృద్ధి చేయని బిజెపికి అనుకూల విధానాలు తీసుకుంటున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గరుగుబిల్లి శ్రీను, ఎం.రామారావు, గొరపాడు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.వారు సిపిఎం కార్యకర్తలు కాదుగుమ్మలక్ష్మీపురం: మండలం కుక్కిడి పంచాయతీ చింతమానుగూడ, రుషినికాలనీకి చెందిన పలువురు సిపిఎం కార్యకర్తలు వైసిపిలో చేరినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు కోలక అవినాష్‌ ఖండించారు. వారు సిపిఎం కార్యకర్తలు కారని, వైసిపి వారని, ప్రచారం కోసం వైసిపి నాయకులే వారికి కండువాలు వేసి ఇలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని ఆయన దుయ్యబట్టారు.

➡️