సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: టీడీపీ

ప్రజాశక్తి-సంతనూతలపాడు జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై పెట్టిన అక్రమ కేసులను సుప్రీంకోర్టు కొట్టివేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టని, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి రంపతోటి అంకారావు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం మద్దినేని హరిబాబు అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అంకారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై అనేక అక్రమ కేసులు బనాయించి జైల్లో వేయించి ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ముందస్తు బెయిలును రద్దు చేయాలని, ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం ఆయన నిజాయితీకి నిదర్శనమన్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అనేక తప్పుడు కేసులు బనాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దుర్మార్గపుచర్య అన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు వెంటే ఉన్నారన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు ముప్పరాజు శ్రీనివాసరావు, ఆళ్ల రాము, చిట్టంశెట్టి శ్రీనివాసరావు, రావులపల్లి సురేష్‌ బాబు, బొడ్డు శంకర్‌, రావుల సుబ్బారావు, సాదినేని శ్రీరామమూర్తి, మన్నం రంగనాయకమ్మ, నార్నే మాధవీలత, కొత్తపల్లి పద్మ, ఝాన్సీలత, టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️