సృజనకు వేదిక ఇన్‌స్పైర్‌ మానక్‌

Feb 13,2024 00:16

బహుమతులు అందుకున్న విద్యార్థులతో ఉప విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు
ప్రజాశక్తి-గుంటూరు : విద్యార్థులను బావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని గుంటూరు, తెనాలి ఉప విద్యాశాఖ అధికారులు పి.వెంకటేశ్వరరావు, ఎం.నిర్మల అన్నారు. స్థానిక పాతబస్టాండ్‌ వద్ద ప్రభుత్వ ఉర్దూ బాలుర హైస్కూల్లో గుంటూరు, బాపట్ల జిల్లాల ఇన్‌స్పైర్‌ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లా నుండి 66, బాపట్ల జిల్లా నుండి 46 ప్రాజెక్టులు ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను ఉప విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వారి సృజనకు పదును పెట్టేలా విజ్ఞానంపై అవగాహన కల్పిస్తూ, కొత్త ఆవిష్కరణలు చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన ప్రయోగాలను ఈనెల 18న చిత్తూరులో జరిగే రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తామన్నారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు బహుకరించారు. కార్యక్రమంలో నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి కృష్ణ జస్విన్‌, డిసిఇబి సెక్రెటరీ లలిత్‌ ప్రసాద్‌, ఉర్దూ డిఐ ఖాసిం, గుంటూరు, బాపట్ల జిల్లాల సైన్స్‌ అధికారులు ఎ.రవికుమార్‌, మహమ్మద్‌ సాదిక్‌, సైన్స్‌ కోఆర్డినేటర్లు గౌసుల్‌మీరా, పవన్‌ భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన ప్రాజెక్టులు
గుంటూరు జిల్లా నుండి చేబ్రోలు మండలం, కొత్తరెడ్డిపాలెం కెజి హైస్కూల్‌ విద్యార్థి జి.యశస్విశివసాయి, మేడికొండూరు మండలం, సిరిపురం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి పి.మస్తాన్‌రావు, పొన్నూరు, నేతాజి నగర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థి షేక్‌.సనాబుష్రా, ప్రత్తిపాడు మండలం, గొట్టిపాడు జెడ్పీ మైస్కూల్‌ నుండి వి.తోమరాజు, వట్టిచెరుకూరు మండలం, ముట్లూరు జెడ్పీ హైస్కూల్‌ నుండి కొచ్చర్ల శిరీష ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా నుండి బల్లికురవ జెడ్పీ హైస్కూల్‌ నుండి ఎస్‌.అమూల్య, ఇంకొల్లు మండలం, పావులూరు జెడ్పీ హైస్కూల్‌ నుండి సిహెచ్‌.అమూల్య, వేమూరు మండలం, జంపని జెడ్పీ హైస్కూల్‌ నుండి సిహెచ్‌.సిందుజ, అద్దంకి నుండి శ్రీప్రకాశం గవర్నమెంట్‌ హైస్కూల్‌ విద్యార్థి ఎల్లల వైష్ణవి ఎంపికయ్యరు.
బీమ్‌ కంట్రోల్‌ సిస్టంతో ప్రమాదాల నివారణ… సాధారణంగా రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు అన్ని రకాల వాహనాలకు మోతాదుకు మించి, ఎక్కువ వెలుతురును ఇచ్చే బల్బులను వాడటం వల్ల ఎదురుగా వచ్చే వాహనచోదకులకు దారి సరిగా కనిపించక, సుమారు 10-15 వేల వరకూ యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ప్రమాదాలను నివారించటానికి కొర్నెపాడు జెడ్పీహైస్కూల్‌ విద్యార్థిని పి.సమీర పూజామణి ప్రత్యేక పరికరాన్ని తయారు చేశారు. ఎదరుగా వస్తున్న వాహనం లైటు వెలుతురు లోబీమ్‌ మై బీమ్‌ కంట్రోల్‌ సిస్టం అమర్చిన వాహనంపై పడగానే లైట్లు ఆటోమేటిక్‌గా వాటంతట అవే డిప్పర్‌, డిమ్మర్‌ అవుతాయి. దీంతో ఎదురుగా వస్తున్నది ఏ వాహనంలో అర్థం చేసుకొని, ప్రమాదాలను నివారించటానికి అవకాశం ఉంటుందని విద్యార్థిని చెప్పారు. ఈ విద్యార్థినికి ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి గైడ్‌గా వ్యవహరించారు.
మందుబాబుల బండిని ఆపే స్మార్ట్‌హెల్మెట్‌… ద్విచక్ర వాహనదారులు కొందరు మద్యం సేవించినప్పుడు అతి వేగంతో, వాహనం అదుపు తప్ప ప్రమాదాలు జరుతాయి. అటువంటి ప్రమాదాలను నివారించటానికి సిరిపురం జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థి పి.మస్తాన్‌రావు స్మార్ట్‌ హెల్మెట్‌ రూపొందించారు. మద్యం సేవించిన వారిలో ఆల్కహాల్‌ లెవల్స్‌ 50 శాతం దాటితో హెల్మెట్‌కు అమర్చిన సెన్సార్‌ గుర్తిస్తుంది. ఈ సెన్సార్‌ను ముందుగానే వాహనానికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మోతాదుకు మించి మద్యం సేవించినప్పుడు ఈ హెల్మెట్‌ సెన్సార్‌ గుర్తించి వాహనానికి సంకేతాలు ఇస్తుంది. సంకేతం అందుకున్న ద్విచక్ర వాహనం స్టార్ట్‌ కాకుండా నియంత్రిస్తుంది. ఈ ప్రయోగానికి ఉపాధ్యాయురాలు గైడ్‌గా వ్యవహరించారు.

➡️