సెక్టోరల్‌ అధికారులదే కీలక పాత్ర : కలెక్టర్‌

ప్రజాశక్తి- రాయచోటి ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సెక్టోరియల్‌ అధికారులకు సూచించారు. శనివారం రాయచోటి పట్టణంలోని గవర్నర్‌ ఫంక్షన్‌ హాల్‌లో 2024-సాధారణ ఎన్నికల నిర్వహణపై సెక్టార్‌ ఆఫీసర్లు, సెక్టార్‌ పోలీస్‌ అధికారులకు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టార్‌ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకొని పనిచేయాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలోఎక్కడ ఏమి జరిగినా వెంటనే తమకు పంపాలన్నారు. పోలింగ్‌ పూర్తయి బ్యాలెట్‌ బాక్సులు స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు తీసుకొచ్చే పూర్తి బాధ్యత మీరే తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ర్యాంపు, వీల్‌ చైర్స్‌, విద్యుత్‌, తాగునీరు మరుగుదొడ్లు, వెబ్‌ క్యాసిటింగ్‌ చేయడానికి అవసరమైన విద్యుత్‌ సౌకర్యాలు అన్ని సక్రమంగా ఉండేటట్లు చూసుకోవాల న్నారు. వల్నరబిలిటి, క్రిటికల్‌, సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి వెంటనే తమకు రిపోర్టు పంపాలన్నారు. సెక్టోరల్‌ అధికారులు ప్రణాళికాబద్ధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చూసుకొని మీకు కేటాయించిన రూటు, పోలింగ్‌ స్టేషన్‌ లను ముందస్తుగా పరిశీలించాలన్నారు. ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు స్వేచ్ఛ వాతావరణం కల్పించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చూడాలన్నారు. పిఒలు, ఎపిఓలకు సంబంధించిన ఫోన్‌ నెంబర్లను సెక్టోరియల్‌ అధికారుల వద్ద ఉంచు కోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం రూపొందించిన సి – విజిల్‌, యాప్‌ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో సి – విజిల్‌ యాప్‌ను ఉపయోగించుకొని ఫిర్యాదులు చేయవచ్చన్నారు. పోలింగ్‌ రోజు ఎటువంటి సమస్యలు తలెత్తిన స్పీకింగ్‌ ఆర్డర్‌ ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి తెలియజేయాలన్నారు. పోలింగ్‌ ఏజెంట్లు ఓటర్లను సావధానంగా హ్యాండిల్‌ చేసే విధంగా చూడాలన్నారు. పోలింగ్‌కు సంబంధించి పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు, పోలింగ్‌ తర్వాత రోజు చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. సెక్టోరల్‌ అధికారులకు కేటాయించిన ప్రాంతంలోనే బస చేయాలన్నారు.రిసెప్షన్‌ సెంటర్లో ప్రతి ఒక్కరు 100 శాతం ఆక్టివ్‌ గా ఉండాలని చెప్పారు. ఎన్నికలలో ఓటు వేసే ఓటర్లు ఓటర్‌ స్లిప్‌తో పాటు రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, పోస్‌ పోర్టు, ఎంప్లారు ఐడి కార్డు, ఏదైనా ఒకటి గుర్తింపు కార్డుతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, రాయచోటి, రాజంపేట, మదనపల్లె ఆర్‌డిఒలు, నియోజకవర్గ స్పెషల్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌ రెడ్డి, డిపిఒ ధనలక్ష్మి, సెక్టోరల్‌ అధికారులు, సెక్టోరల్‌ పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️