రెవెన్యూశాఖలో జవాబుదారీతనం

Jun 20,2024 20:23 #ap assembly, #minister, #Satyaprasad
  • కోర్టు కేసుల సమర్ధ నిర్వహణకు ఆన్‌లైన్‌లో రెవెన్యూ కోర్టు
  •  మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రెవెన్యూశాఖ అందించే పౌరసేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా చర్యలు చేపట్టడంతోపాటు శాఖలో జవాబుదారీతనం పెంపొందించేలా కృషి చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లో రెవెన్యూశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూశాఖను దేశంలోనే ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం భూముల రీసర్వేలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలో సర్టిఫికెట్ల జారీకి తగిన కార్యాచరణ చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు కేసుల సమర్ధ నిర్వహణ కోసం ఆన్‌లైన్‌లో రెవెన్యూ కోర్టు విధానాన్ని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మంత్రి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముందు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి సాయిప్రసాద్‌, అజరుజైన్‌, రెవెన్యూశాఖకు చెందిన మరో అధికారి ప్రభాకర్‌రెడ్డి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన రవికుమార్‌, ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

➡️