సైన్స్‌తోనే సమాజాభివృద్ధి: జెవివి

ప్రజాశక్తి-రాయచోటి శాస్త్రీయ దక్పథాన్ని అలవరుచుకుని, సజనాత్మకతను పెంపొందించుకుని మూఢనమ్మకాలను విడనాడాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు మురళీధర్‌ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సైన్స్‌ కళాజాతా గురువారం రాయచోటికి చేరుకుంది. స్థానిక శ్రీసాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో విజ్ఞాన, వినోద, మ్యూజిక్‌ కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. శ్రీకాకుళం నుంచి మొదలైన ఈ కార్యక్రమం అనంతపురం జిల్లాలో పర్యటించే వరకు కొనసాగుతుందని తెలిపారు. సైన్స్‌తోనే సమాజాభివద్ధి సాధ్యమన్నారు. శాస్త్ర, సాంకేతికత విజ్ఞానాన్ని భవిష్యత్‌ తరానికి అందించినప్పుడే దేశం అన్నిరంగాల్లో ముందడుగు వేస్తుందని తెలిపారు. మూఢనమ్మకాల పంజరాల్లో చిక్కుకున్న ప్రజలను విజ్ఞాన రంగాల వైపు మళ్లించేలా యువత ముందుకు రావాలని కోరారు. మూఢనమ్మకాలను సమాజం నుంచి దూరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో 25 మంది కళాకారులు పాల్గొంటున్నారని వారి చేత సైన్స్‌ నాటికలు, సైన్స్‌ పాటలు, మ్యాజిక్‌ షో, సైన్స్‌ ప్రయోగాలు మొదలైన అంశాలు ప్రదర్శించామని తెలిపారు. నవతరానికి తగ్గట్టు పాటలు రూపొందించామని తెలిపారు. శ్రీసాయి ఇంజినీరింగ్‌ కళాశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించడానికి తీవ్రంగా కషి చేస్తున్నందుకు వారిని అభినందించారు. విజ్ఞాన శాస్త్రం అభివద్ధి చెందితేనే దేశాభివద్ధి జరుగుతుందన్నారు. విజ్ఞాన శాస్త్రం కోసం ఎందరో శాస్త్రవేత్తలు ప్రాణాలర్పించారు. సైన్స్‌ మనిషి జీవితానికి ఒక దిక్సూచి అని అన్నారు. మానవత రాష్ట్ర కమిటీ నాయకులు సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఆటపాటల ద్వారా విజ్ఞానాన్ని కలిగించేందుకు జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కషిని అభినందించారు. జిల్లా సైన్స్‌ అధికారి ఓబుల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వివిధ కత్యాల ద్వారా పాఠ్యాంశాలను అవగాహన పెంచుకునేందుకు కషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో త్రిమూర్తులురెడ్డి, మానవత కమిటీ సభ్యులు సహదేవరెడ్డి, లయన్‌ హరినాథరెడ్డి, పాఠశాల అధ్యాపక బందం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ప్రభుచరణ్‌, ఆంజనేయులు, నాగశేషారెడ్డి, వినరు కుమార్‌, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజానాట్య మండలి సభ్యులు పాల్గొన్నారు. జాతాలో కళా బందాలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్యం కల్పించేలా నాటికలు, గీతాలతో కళారూపాలను ప్రదర్శించాయి.

➡️