స్పందనలో సమస్యలకు పరిష్కారం

Dec 18,2023 23:20 #స్పందన
స్పందనలో సమస్యలకు పరిష్కారం

ప్రజాశక్తి-అమలాపురంఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల సమస్యల పట్ల క్రియాత్మకంగా స్పందించి సత్వరమే తగు పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్‌లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌ సత్తిబాబుతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అర్జీల పరిష్కార సరళిని మెరుగు పరచాలని సూచించారు. గడువు దాటిన అర్జీలు లేకుండా నిర్ధేశిత కాల వ్యవధిలో పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. ప్రతి జిల్లా స్థాయి అధికారి తమ లాగిన్‌కు వచ్చిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక పోకస్‌ పెట్టాలన్నారు. అర్జీదారుని సంతప్తి ధ్యేయంగా అర్జీలు పరిష్కరిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమం పట్ల అర్జీదారుల్లో విశ్వసనీయతను పెంపొందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఒకసారి సమర్పించిన అర్జీ మరలా అదే అంశంపై పునరావతం కాకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, జగనన్నకు చెబుదాం పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, డిసిహెచ్‌ఎస్‌ పద్మశ్రీరాణి డిఆర్‌డిఎ పీడీ వి.శివశంకర్‌ ప్రసాద్‌, డ్వామా పీడీ ఎస్‌.మధుసూదన్‌, ఆర్‌డబ్లుఎస్‌ ఎస్‌ఇ సిహెచ్‌.కృష్ణారెడ్డి, సిపిఒ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి జివి.సత్యవాణి మార్కెటింగ్‌ శాఖ ఎడి కె.విశాలాక్షి, ఇరిగేషన్‌ ఇఇ బుల్లిరాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️