స్పందన అర్జీలను సత్వరం పరిష్కరించాలి: జెసి

ప్రజాశక్తి-వెలిగండ్ల: స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్‌ కే శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం వెలిగండ్ల మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం స్పందన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంయుక్త కలెక్టర్‌ కే శ్రీనివాసులు హాజరై 130 అర్జీలను స్వీకరించారు. అనంతరం వచ్చిన అర్జీల పరిష్కార దిశగా అక్కడికక్కడే సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. రాళ్లపల్లి, గన్నవరం, మొగులూరు, వెలిగండ్ల, గుడిపాటిపల్లి పంచాయతీలో 2005లో పట్టాలు ఇచ్చారని, నేటికీ ఎంతోమంది తహశీల్దార్లు మారినప్పటికీ పట్టాదారులకు ఆ పొలాలు చూపలేదని దళిత నాయకులు గోన దానయ్య జెసి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన జేసి వారం రోజుల్లో పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కంకణంపాడు గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామకంఠం సర్వే నంబర్‌ 337/2లో నాలుగు సెంట్ల గ్రామకంఠ స్థలాన్ని వైసీపీ నాయకుల అండదండలతో గ్రామంలో కొందరు ఆక్రమించి రూములు ఏర్పాటు చేశారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రాళ్లపల్లి పంచాయతీలోని కండ్రిక గ్రామంలో సర్వే నెంబర్‌ 21 /1లో 3.29 ఎకరాల రిజిస్ట్రేషన్‌ భూమిని ఇతరులు ఆక్రమించి ఆన్‌లైన్‌ చేయించుకున్నారని ముక్కు తిరుపతయ్య జెసి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు జేపీ రాజు మాట్లాడుతూ మహనీయులు అంబేద్కర్‌ పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్‌ రామస్వామి, అబ్దుల్‌ కలాం, జగ్జీవన్‌రాం ప్రాంగణాలకు స్థలం కేటాయించాలని జెసిని కోరారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు తాము గత పది రోజులుగా నిర్వహిస్తున్న ధర్నాలో వారి సమస్యలు పరిష్కరించాలని జెసికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్‌ యాదవ్‌, ఆర్డిఓ పాలపర్తి జానీ ఇర్విన్‌, ఎంపీడీవో తాతపూడి సుకుమార్‌, తహశీల్దారు ఎన్‌ వాసు, ఎంపీపీ రామణ మహాలక్ష్మి, జెడ్పిటిసి సభ్యులు గుంటక తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రామన్న తిరుపతిరెడ్డి, డ్వామా పిడి సీనారెడ్డి, డిఆర్‌డిఏపిడి తేళ్ల రవికుమార్‌, డిఎల్‌పిఓ శోభన్‌బాబు, టిఆర్‌ఎస్‌ ఇ కొండయ్య, సిపిఓ వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ శ్యాంబాబు, జాయింట్‌ డైరెక్టర్‌ ఆర్‌డిఓ పరిశపోగు రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. మా పేర్లు ఆన్‌లైన్‌లో ఎక్కించండి తమ పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను తమ పేరున ఆన్‌లైన్‌ చేయాలని వెలిగండ్ల మండలం మొగులూరుపల్లి గ్రామానికి చెందిన ఎరుకుల కులస్తులైన జగన్నాథం తిరుపతయ్య, శ్రీరామ వెంకట్రావు కోరారు. వెలిగండ్లలో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కే శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జాయింట్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. బినామీ పట్టాలతో భూములు కాజేస్తున్నారు హనుమంతునిపాడు: హనుమంతునిపాడు మండలం పెద్ది వెంకటాయపల్లి గ్రామ సర్వే నెంబర్‌ 1లో 538 ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్‌ భూమిలో స్థానికేతరుల పేరుతో బినామీ పట్టాలు సృష్టించి అక్రమంగా కాజేస్తున్నారని, ఈ పట్టాలు అన్నిటినీ రద్దుచేసి స్థానిక భూమిలేని ఎస్సీ ఎస్టీ బీసీ పేదల కులాలకు చెందిన వారికి పంపిణీ చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌కు వెలిగండ్ల మండలంలో జరిగిన స్పెషల్‌ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అసైన్మెంట్‌ భూమి పేదలకు దక్కాల్సిఉండగా కొద్దిమంది వ్యక్తులు బినామీ పట్టాలు స్థానిక రిటైర్డ్‌ విఆర్‌ఒ సహకారంతో పొందారని, మండలంలో లేనివారు, గ్రామంలో లేనివారు, జిల్లాలో లేనివారు అనేకమంది ఈ భూమిలో లబ్ధిదారులుగా ఉన్నారని, మొత్తం భూమిని, బినామీ పట్టాలను ప్రభుత్వం స్వాధీనపరచుకొని స్థానిక భూమిలేని పేదలను గుర్తించి పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేసి నివేదిక అందజేయాలని స్థానిక ఆర్‌డిఒను ఆదేశించారు.

➡️