స్ఫూర్తినియం అంగన్వాడీల పోరాటం

Feb 4,2024 16:23 #Anganwadi Workers, #meeting
  • సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్‌
  • రంపచోడవరంలో విజయోత్సవ సభ

ప్రజాశక్తి-రంపచోడవరం(అల్లూరి) : అంగన్వాడీల వీరోచిత పోరాటం స్ఫూర్తినియ్యమని సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌ అన్నారు. అంగన్వాడీలు 42 రోజులు పాటు సమ్మె వివిధ రూపాల్లో ఆందోళన చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వారి సమస్యలు పరిష్కారానికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు అనుబంధం రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నిర్మల అద్యక్షన విజయోత్సవ సభ రంపచోడవరం నిర్వహించారు. తొలుత కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐటియు రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌ మాట్లాడుతూ.. అంగన్వాడీలు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు సాధనకై తమ ప్రాణాలను పణంగా పెట్టారని రాష్ట్రంలో ఎన్నడు కని విని ఎరగని రీతిలో అంగన్వాడీలు చేసిన ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అయిందన్నారు. ఇది అంగనవాడీల ఐక్య పోరాటం విజయమని ఐక్యంగా పోరాడితే ఏ సమస్యనైనా సాధించుకోవచ్చని నిరూపించారని తెలిపారు. అంగనవాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నిర్మల,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం.వాణిశ్రీ మాట్లాడుతూ.. ఐక్యంగా కదిలిన అంగన్వాడీలకు ఉద్యమ అభినందనలు తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతు ఇచ్చిన గిరిజన సంఘం సిఐటియు చేతివత్తులు ప్రజా సంఘాలు, పలు రంగాల నాయకులకు, అలాగే గ్రామస్తులకు, అంగన్వాడీల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈ సిరిమల్లి రెడ్డి మాట్లాడుతూ.. ”భగభగ మండే సూర్యుని చూడు అంగన్వాడీల సత్తా చూడు” అనే ఒక్క నినాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేలా చేసిందన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ రంగాల్లో పనిచేసే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి సంఘీభావం తెలపాలన్నారు. అంగన్వాడీ యూనియన్‌ జిల్లా నాయకురాలు కె.రామలక్ష్మి, కె.రాణి, తదితరులు మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన అంగన్వాడీలకు ఉద్యమ అభినందనలు తెలిపారు. అనంతరం అంగన్వాడీలు కార్మిక సంఘాల పాటలకు నత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.రామరాజు, కె.శాంతి రాజు, పలు మండలాల అంగన్వాడీ యూనియన్‌ నాయకులు చిన్ని కుమారి, కె వెంకటలక్ష్మీ, సింగారమ్మ, రత్నకుమారి, నాగదేవి, సీహెచ్‌ లక్ష్మీ, ప్రసూన పెద్దసంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️