హస్త కళను ప్రోత్సహించేందుకు బొమ్మల ప్రదర్శన

ప్రజాశక్తి – వేంపల్లె (వీరపునాయునిపల్లె) హస్త కళలను ప్రోత్సాహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర ఫిజికల్‌ సైన్స్‌ రిసోర్స్‌ పర్సన్‌ కృష్ణకిషోర్‌ పేర్కొన్నారు. వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం హస్తకళలను ప్రోత్సహిస్తూ విద్యార్థులు తయారు చేసిన మట్టి బొమ్మలు, కాగితపు బొమ్మల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఫిజికల్‌ సైన్స్‌ రిసోర్స్‌ పర్సన్‌ కృష్ణకిషోర్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులు తయారు చేసిన హస్త కళల బొమ్మలను ఉపాధ్యాయులతో పరిశీలించారు. విద్యా ర్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు హస్తకళల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. హస్తకళల కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన కొండపల్లి చెక్క బొమ్మలు, లేపాక్షి కళల గూర్చి ఆయన విద్యార్థులకు వివరించారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు, హిందీ ఉపాధ్యాయుడు దరియా సుజన్‌ కుమార్‌ మాట్లాడుతూ హస్త కళను ప్రోత్సాహించేందుకు విద్యార్థులతో బొమ్మల ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు. కొండపల్లికి యాత్ర అనే పాఠం ద్వారా విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌లోని హస్తకళ కళాకారులను గురించి అవగాహన కలిగించామన్నారు. కడప జిల్లాలో హస్తకళలకు సంబంధించి వనిపెంట గ్రామంలో కాంస్య, ఇత్తడి సామాన్లు తయారు చేసుకుని కళాకారుల కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయన్నారు. జిల్లా హస్తకళ కళాకారులుగా గుర్తింపు పొందారని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుజాతమ్మ, ఆదినారాయణ, జయ రాణెమ్మ, రాజశేఖర్‌, మాధవి, నరేంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️