హామీలను అమలు చేయాలి : డివైఎఫ్‌ఐ

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రయివేట్‌ టీచర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్‌ తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే అసెంబ్లీ సమావేశాలలో ప్రయివేట్‌ టీచర్లకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని చెప్పారు. పిఎఫ్‌, ఇఎస్‌ఐ, కనీస వేతనం, సెలవులు వంటి వాటిపై ప్రయివేట్‌ విద్యాసంస్థలలో అమలు అయ్యేలా చేస్తామని చెప్పి హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపుకు ప్రయివేట్‌ టీచర్లు కీలక భూమిక పోషించారని తెలిపారు. కానీ వారి న్యాయమైన కోర్కెలు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని వాపోయారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఆదివారం భారీగా వందలాది మంది టీచర్లను కడపకు తరలించి బూటకపు హామీలు ఇస్తున్నారన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రయివేట్‌ టీచర్ల సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడారా, కనీసం పోరాడారా అని ప్రశ్నించారు. .ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రయివేట్‌ టీచర్ల వేదన, ఆక్రందన గమనించి వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో నగర అధ్యక్షులు షేక్‌. షాకీర్‌ పాల్గొన్నారు.

➡️