హామీలను అమలు చేయాల్సిందే

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, సి.రాంబాబు డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె 16వ రోజుకు చేరింది. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించినా మున్సిపల్‌ కార్మికుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని, ముందే సమ్మె నోటీసు ఇచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. పాదయాత్రలో సిఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కాంట్రాక్ట్‌, అవుట్సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని కార్మికులకు పెండింగ్‌ ఏరియర్స్‌ చెల్లించాలని కోరారు. క్లాప్‌ వాహనాల డ్రైవర్లకు జిఒ ఏడు ప్రకారం రూ.18,500 వేతనం ఇవ్వాలని, దళారీ వ్యవస్థను రద్దుచేసి మునిసిపాలిటీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ వాహనాల డ్రైవర్లకు కాంట్రాక్టర్లు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, వారాంతపు సెలవులు, పండగ సెలవులు అమలు చేయడం లేదని, గుర్తింపు కార్డులు, యూనిఫారమ్‌, మాస్కులు, గ్లాజులు, కొబ్బరి నూనె వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

➡️