హామీలనే అమలు చేయాలంటున్నాం

నరసరావుపేటలో తపాలా డబ్బాలో ఉత్తరాలు వేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకూ సమ్మె కొనసాగుతుందని ఏపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్యోగుల 13వ రోజు సమ్మెలో భాగంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరాన్ని నాగేశ్వరరావు సోమవారం సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో సమ్మె ఉధృత రూపం దాలుస్తుందని హ్చెరించారు. నూతన సంవత్సరంలో ఆనందంగా ఉండాల్సిన ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందన్నారు. మంత్రుల కమిటీతో చర్చలకు పిలిచి అసలు సమస్యలను పక్కదారి పట్టించి, సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం పథకం రూపొందిస్తోందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లన్నీ న్యాయమైనవని, గతంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి వీటి పట్ల సానుకూలత తెలిపినవేనని అన్నారు. నూతన సంవత్సర సందర్భంగా జగన్మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసూ, సమస్యలు పరిష్కరించాలని పో స్టు కార్డులు పంపించారు. కార్యక్రమంలో జెఎసి జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌, అబ్దుల్‌ రెహమాన్‌, మహిళా కార్యదర్శి రాధా, కిరణ్‌ కుమార్‌, శివ పార్వతి, జాఫర్‌, దుర్గా, శ్రీదేవి, చంద్ర, మాధురి, భాగ్యరాజు, మజీద్‌, సుభాని పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో సమ్మె శిబిరం కొనసాగింది. ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి స్థానిక తపాల కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తపాలా డబ్బాలో ఉత్తరాలు పోస్ట్‌ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన యుటిఎఫ్‌ నకరికల్లు మండల కోశాధికారి పచ్చవ బాలాజీ మాట్లాడుతూ విద్యా సంబంధిత పథకాల అమలులో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమని, ఒక్కో స్కూల్‌ కాంప్లెక్స్‌ పరిధిలో ఉన్న పాఠశాలలకు నిరంతరం వెళ్లి విద్యా శాఖకు ప్రభుత్వ పరంగా అందుతున్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, పుస్తకాలు, జెవికె కిట్లను, ట్యాబ్లు పంపిణీ ఇతర పథకాలను విద్యార్థులకు చేరువ చేయడంలో సమగ్ర శిక్ష ఉద్యోగులే కీలకంగా పని చేస్తు న్నారని చెప్పారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ ఉన్నత చదువులు చదివిన వారేనని, ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే ఏనాటికైనా ప్రభుత్వం తమ సేవలను గుర్తించి రెగ్యులర్‌ చేస్తారని కనీస వేతనాలు ఇస్తారనే ఆశతో పని చేస్తున్నారని అన్నారు. అరకొర వేతనాలతో పని చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. అనం తరం సమ్మె శిబిరంలో ప్రజాశక్తి నూతన సంవత్సర కేలండర్‌ను ఆవిష్కరించారు. నాయ కులు బి.సాంబశివరావు, పి.రామకృష్ణ, శ్రీకాంత్‌, మస్తాన్‌, లాజర్‌, వెంకటేశ్వర్లు, శేషలత, మమత, నాగలక్ష్మి, మంజు, ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

➡️