Mar 16,2024 21:58

నేటి నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి జాతరప్రజాశక్తి-చీపురుపల్లి ఉత్తరాంధ్ర జిల్లాల కల్పవల్లి కనకమహలక్ష్మి అమ్మవారి జాతరకు సర్వం సిధ్దం అయ్యింది. ఈనెల 17, 18, 19 తేదీలలో అమ్మవారి జాతరను జరిపేందుకు ఆలయ కమిటీతో పాటు దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా జాతరకు అన్ని ఏర్పాట్లూ చేశారు. మూడు రోజుల పాటు జరిగే జాతరకు సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ తెలిపింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. జాతరకు భారీ బందోబస్తు జాతరకు సంబంధించి సుమారు 9వందల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్‌పి చక్రవర్తి తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయ పరిసరాలను స్థానిక సిఐ సిహెచ్‌ షన్ముఖరావు, ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అమ్మవారి జాతరకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండడంతో పాటు జాతర సజావుగా సాగేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ముగ్గురు డిఎస్‌పిలు, 8 మంది సిఐలు, 42 మంది ఎస్‌ఐలతో పాటు 8 వందల మంది పోలీసులను ఏర్పాటు చేసామన్నారు. అలాగే రెండు క్రైం టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌కు సంబంధించి చీపురుపల్లి పట్టణం వైపు పాత కోర్టు ప్రాంగణం, పంచాయతీ కార్యాలయ ప్రాంగణం, బాలుర ఉన్నత పాఠశాల గ్రౌండ్‌, రావివలస జంక్షన్‌లో వాహనాలు నిలుపుకొనేందుకు ఏర్పాటు చేసామన్నారు. సరుకు రవాణా వాహనాలకు ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. శ్రీకాకుళం నుండి వయా చీపురుపల్లి మీదుగా విజయనగరం వెళ్లాల్సిన వాహనాలు సుభధ్రాపురం హైవే మీదుగా వెళ్లాలని డిఎస్‌పి సూచించారు. విజయనగరం నుండి చీపురుపల్లి మీదుగా వెళ్లాల్సిన వాహనాలు గరివిడి బ్రిడ్జి వద్ద నుండి ఉత్తరావల్లి మీదుగా వెళ్లాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో 15 సిసి కెమెరాలను ఏర్పాటు చేసామనితెలిపారు. ఆలయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఇప్పిలి సూర్య ప్రకాశరావు, వైస్‌ చైర్మన్‌ సూరు కుమార్‌, ఇఒ జి.శ్రీనివాసరావులకు డిఎస్‌పి చక్రవర్తి సూచించారు.

➡️