108 ఉద్యోగులు సమ్మె నోటీసులు

ప్రజాశక్తి-గుంటూరు : తమ సమస్యలను పరిష్కరించకుంటే ఈనెల 23వ తేదీన సమ్మె చేస్తామని 108 ఉద్యోగుల హెచ్చరించారు. ఈ మేరకు ఎపి 108 సర్వీసెస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులను జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారికి, డిఎఅండ్‌హెచ్‌ఒకు, డిసికి, 108 డిఎంకు అందచేశారు. ఈలోగా పలు రూపాల్లో వినతులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, అప్పటికీ స్పందించకపోతే సమ్మె తప్పదని నాయకులు స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్లుగా ఉద్యోగుల్ని అవుట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌లో చేరుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయమని తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. వైద్యారోగ్యశాఖలో డిఎంఇ ద్వారా నోటిఫికేషన్‌తో భర్తీ చేస్తున్న ఇఎమ్‌టి పోస్టుల్లో 108లోని ఇఎమ్‌టిలను కాంట్రాక్ట్‌ పద్దతిపై నియమిస్తూ ప్రాధాన్యం కల్పించాలని, 108లోని పైలట్లకు ఆర్టీసి, ఇతర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్‌ డ్రైవర్‌ పోస్టుల్లో నియమించాలని, ఆప్కాస్‌లో చేర్చాలని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లోని ఉద్యోగులందర్నీ ఆప్కాస్‌లో చేర్చాలని, జిఒ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, 104 ఎంఎంయు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, శ్లాబ్‌లు అప్‌గ్రేడ్‌ చేసి వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బి.యోహోషువ, ఎస్‌.కె.బాబు, సునన్‌ పాల్గొన్నారు.

➡️