11, 12న కలెక్టరేట్‌ వద్ద ఆశాల 36 గంటల నిరసన

Dec 4,2023 20:46

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూపు ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈనెల 11,12తేదీల్లో కలెక్టరేట్‌ వద్ద 36 గంటల పాటు నిరసన తెలుపుతామని ఆశావర్కర్ల యూనియన్‌ నాయకులు సోమవారం డిఎంహెచ్‌ఒ భాస్కరరావుకు వినతినిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సుధారాణి మాట్లాడుతూ ఆశ వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ఆన్‌లైన్‌లో రికార్డు వర్క్‌, మొబైల్‌ వర్క్‌ లాంటి ఒత్తిడితో పనిబారం పెరగడం వల్ల అనారోగ్యాలకు గువుతున్నారని తెలిపారు. కనీసం వేతనాలు లేకుండా సంక్షేమ పథకాలు సక్రముగా ఇవ్వకుండా, మెడికల్‌, మెటర్నిటీ సెలవులు అమలు చేయకుండా టిఎ, డిఎ ఇవ్వకుండా ఆశావర్కర్లతో ప్రభుత్వం వెట్టిచాకిరీ చేయించుకుంటోందని తెలిపారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, మెడికల్‌ లీవులు, ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని, పది లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కల్పించాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్స్‌ ను ఆశలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆశా వర్కర్లు డి.పద్మ, ఎ.శ్రీదేవి, ఎ.రాధ, ఎం.రాజేశ్వరి, పి.పైడిరాజు, ఐ.లక్ష్మి ప్రసన్న, బి.త్రివేణి, బి.పైడిరాజు పాల్గొన్నారు.

➡️