17న గుంటూరులో రాష్ట్ర స్థాయి సదస్సు

ప్రజాశక్తి-గుంటూరు : సిఐటియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ శతజయంతుత్సవాల్లో భాగంగా డిసెంబర్‌ 17న ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-కార్మికులు, ఉద్యోగులపై ప్రభావం’ అంశంపై గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి సెమినార్‌ను జయప్రదం చేయాలని సెమినార్‌ నిర్వాహక కమిటీ గౌరవాధ్యక్షులు ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బ్రాడీపేట సిఐటియు నగర కార్యాలయంలో సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించి విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మిక చట్టాల్లో మార్పు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు జరపకపోవడం వంటి వాటితో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో 17న ఉదయం 10 గంటలకు గుంటూరు ఎన్జీవో కళ్యాణ మండపంలో జరిగే రాష్ట్రస్థాయి సెమినార్‌లో గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరావు, కార్యదర్శి దయా రమాదేవి, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.లక్ష్మీనారాయణ వై.నేతాజి ప్రసంగిస్తారని తెలిపారు. సదస్సు నిర్వహణకు ఉద్యోగులు, కార్మికులు ప్రముఖులు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు బి.లక్ష్మణరావు, బి.ముత్యాలరావు, నాయకులు జి.లూథర్‌పాల్‌, షేక్‌ ఖాసీం షాహిద్‌ పాల్గొన్నారు.

➡️