Dec 7,2023 21:41

 ప్రజాశక్తి-విజయనగరం :  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అసైన్డ్‌ భూములపై శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. అసైన్డ్‌ భూములకు హక్కుల కేటాయింపు, ఈ ప్రక్రియలో తిరస్కరణకు గురైన అంశాలపై తాహశీల్దార్లకు, డిప్యూటీ తాహశీల్దార్లకు గురువారం కలెక్టరేట్‌లో వర్క్‌షాప్‌ నిర్వహించారు. తిరస్కరించిన భూములపై మండలాల వారీగా జెసి సమీక్షించి కారణాలను తెలుసుకున్నారు. పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివిధ అంశాలను వివరించారు.ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, అసైన్డ్‌ భూములను 22 ఎ జాబితా నుంచి తొలగించి, వాటిపై శాశ్వత యాజమాన్య హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ధేశించిన అంశాలను వివరించారు. 2003 సంవత్సరం కంటే ముందు ఇచ్చిన భూములకు మాత్రమే ఈ ఆదేశాలు వర్తిస్తాయని జెసి చెప్పారు. ఆ భూమి ఖచ్చితంగా అసైన్డ్‌ అయి ఉండాలని, లబ్దిదారుని యాజమాన్యంలోనే ఆ భూమి ఉండి ఉండాలని, 22 ఎజాబితాలో ఉన్న భూములకు మాత్రమే ప్రభుత్వం జారీ చేసిన జిఒ వర్తిస్తుందని జెసి స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌, పిఒఎల్‌ఆర్‌ లాంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డుల్లో రైతు పేరు ఉన్నా సరిపోతుందని చెప్పారు. ఒకే సర్వే నంబరులో వేర్వేరు వ్యక్తులకు అసైన్డ్‌ చేసి ఉన్నట్లయితే, ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి సబ్‌డివిజన్‌ చేసి, వారి భూమికి హక్కులు కల్పించాలని, 22ఎ జాబితానుంచి తొలగించాలని ఆదేశించారు. డికెటి పట్టాలే కాకుండా, ప్రొవిజనల్‌ పట్టాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారికి వారి భూములపై శాశ్వత హక్కులు కల్పించి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా నిబంధనలను పాటిస్తూ రైతులకు మేలు చేకూర్చాలని జెసి కోరారు. వర్క్‌షాపులో ట్రైనీ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, ఆర్‌డిఒలు పాల్గొన్నారు.

➡️