24వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 4,2024 22:08

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పె ంచాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు వినూత్న నిరసనలు చేశారు. కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన సమ్మె శిబిరంలో వేప జంటలు పట్టుకొని అమ్మోరులా ఊగుతూ జగన్మోహన్‌ రెడ్డికి మంచి బుద్ది ఇవ్వాలని, తమ వేతనాలు పెంచాలని కోరుతూ వినూ త్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, నాయకులు రాధ, ఉష, సుశీల తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని నోటీసులు ఇచ్చిన బెదిరింపులకు పాల్పడినా బెదిరేది లేదని తెలిపారు.

24 అంకెతో అంగన్వాడీల నిరసన

గజపతినగరం : సమ్మె చేపట్టి 24 రోజులైన సందర్భంగా జాతీయ రహదారి పక్కన అంగన్వాడీలు 24 అంకె ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సి ఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి మాట్లాడుతూ ఏ సమస్యనైనా క్షణాల్లో పరిష్కారం చేస్తానని చెప్పుకుంటున్న మన ముఖ్యమంత్రి 24 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్య కోసం మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేనియెడల ఆరో తేదీ నుండి సమ్మెను ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు ఎం సుభాషిని, డి నాగమణి, సన్యాసమ్మ, జ్యోతి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఉరి తాళ్లతో నిరసన

కొత్తవలస : అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె శిబిరంలో మెడకు ఉరితాళ్లు వేసుకొని వినూత్న నిరసన తెలిపారు. 24 రోజులగా సమ్మె చేసున్నా ప్రభుత్వం కనీసం స్పందించుకోవడం విచారకరమని అంగన్వాడీ ప్రాజెక్టు నాయకురాలు కాకర తులసి ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.

శృంగవరపుకోట : ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీలంతా సమ్మె కొనసాగించారు. విధులకు హాజరు కావాలని ప్రభుత్వం పంపిన సర్కులర్‌ కాపీలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు డి.శ్యామల, డి.జయలక్ష్మి, ఎఐటియుసి అనుబంధ సంఘం నాయకులు వి.మాణిక్యం, కె.సుశీల తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రం తెరవాలని నాయకుల ఒత్తిడి

భోగాపురం : భోగాపురంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్త స్పృహ తప్పి పడిపోయింది. కేంద్రాలు తెరవాలని నాయకులు ఒత్తిడి చేయడం వల్లే ఇలా జరిగిందని అంగన్వాడీలు ఆరోపించారు. పూసపాటిరేగ మండలం కుమిలి పంచాయతీ పెదపత్తినవలస గ్రామానికి చెందిన తాతయ్యమ్మ కార్యకర్తగా పనిచేస్తుంది. పంచాయతీ సర్పంచ్‌ ఆమె భర్తకు ఫోన్‌ చేసి అంగన్వాడీ కేంద్రం తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆమె భర్త తాతయ్యమ్మకు ఫోన్‌ చేసి కేంద్రం తెరవాలని గురువారం ఉదయం నుంచి ఒత్తిడి చేశాడు. భర్తతో మాట్లాడుతుండగా ఆందోళనతో స్పృహతప్పి పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న అంగన్వాడి కార్యకర్తలు ఆమెను మోసుకుంటూ వెళ్తుండగా ఎస్‌ఐ కష్ణమూర్తి తన జీపులో సుందరపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేంద్రాలు తెరవాలని నాయకులు ఒత్తిడి చేయడం సరికాదని యూనియన్‌ నాయకురాలు కృష్ణవేణి అన్నారు.

రాజాం : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను బెదిరించడం మానుకొని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేయకుండా అంగన్వాడీలను బెదిరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం బెదిరిస్తే భయపడేది అంగన్వాడీ ఉద్యమం కాదని, సిఐటియు అండగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జామి : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీలంతా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు కనకమహాలక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు గాడి అప్పారావు, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️