శివారు భూములకు సాగునీరందించాలి

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వంశధార కాలువలకు షట్టర్లు బిగించి

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు

వంశధార కాలువల్లో షట్టర్లు అమర్చాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వంశధార కాలువలకు షట్టర్లు బిగించి శివారు భూములకు సాగునీరందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వంశధారలో నీరున్నా రైతాంగానికి నీరందకపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని విమర్శించారు. 2009లో షట్టర్ల కుంభకోణం జరిగి 15 ఏళ్లు గడుస్తున్నా పాడైపోయిన షట్టర్ల స్థానంలో కొత్తవి వేయలేదని తెలిపారు. మరోవైపు 900 టన్నుల షట్టర్లు గోడౌన్‌లో మూలుగుతూ తుప్పు పడుతున్నాయని, వాటిని ఎందుకు బిగించడం లేదని వారు ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువకు కొత్త షట్టర్లు బిగించకుండా శివారు భూములకు నీరు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వంశధార ఎడమ కాలువ పొడవు 105 కిలోమీటర్లలో 60 కిలోమీటర్లు అంటే హిరమండలం నుంచి టెక్కలి వరకు అన్ని షట్టర్లు, మదుములు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. వాటికి తక్షణమే మరమ్మతులు చేయకపోతే కాలువలో నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. ఎడమ కాలువకు 68 పిల్ల కాలువలు, కుడి కాలువకు 37 పిల్ల కాలువలు పూర్తిగా మరమ్మతులకు నోచుకోలేదని విమర్శించారు. వంశధార కాలువను ఆపరేట్‌ చేయడానికి గతంలో 200 మంది లస్కర్స్‌ ఉండేవారని, నేడు 20 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. దీనివల్ల కాలువ నిర్వహణ కూడా జరిగే పరిస్థితి లేదన్నారు. లస్కర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వంశధారపై పాలకుల నిర్లక్ష్యంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. వంశధార బ్యారేజీ పూర్తయి 50 ఏళ్లు అయిందని నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో శిథిలావస్థకు చేరుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 ఏళ్లు పూర్తయిన ప్రాజెక్టులను ఆధునీకరణ చేయాల్సి ఉందన్నారు. దాని ప్రకారం వంశధార ప్రాజెక్టుకు సుమారు రూ.వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని తెలిపారు. కొండపేట ఎత్తిపోతలకు పథకం మరమ్మతులు చేసి నీరందించాలి డిమాండ్‌ చేశారు.

 

➡️