24 గంటలూ పటిష్ట నిఘా

May 24,2024 23:01

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భద్రతను పరిశీలిస్తున్న పల్నాడు ఎస్పీ
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఓట్ల లెక్కింపు రోజు సమీపిస్తున్న కొద్ది ఉద్రిక్తత వాతావరణం పెరుగుతోంది. మరోవైపు అవాంఛనీయ ఘటనలు మరోసారి తలెత్తకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిఘా, భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల ముందుగానీ, తరువాత గానీ గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, స్టేజ్‌ ప్రోగ్రాంలకు అనుమతుల్లేవని పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలను ఎవరు మీరినా చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను రెచ్చగొట్టేలా రాజకీయ నాయకుల సందేశాలు, నిరాధార ఆరోపణలు, రచ్చబండ చర్చలు, సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైన వాటిని నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. పెట్రోలు బంకుల్లో వాహనానికి తప్ప క్యాన్లలో పెట్రోల్‌ అమ్మకాలతో పాటు బాణసంచా విక్రయాలపై ఆంక్షలు విధించారు. జూదం, కోడి పందేలు, బెట్టింగ్‌ మొదలైన చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు ప్రకటించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా, మద్యం,నిషేదిత వస్తువులు, అక్రమ రవాణా జరగకుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కౌంటింగ్‌ రోజు ముందు లేదా తర్వాత రోజు వివాదాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే 1500 మంది బైండోవర్‌గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ గ్రూపులకు చెందిన వారు, ప్రజలతో సిఐ, ఎస్‌ఐ స్థాయి పోలీసు అధికారులు మావేశాలు నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు పాల్పడితే తీసుకునే కఠిన చర్యలను వివరిస్తున్నారు. గ్రామాల్లో పోలీసు పికెట్‌, పెట్రోలింగ్‌, ఔట్‌ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేవారు, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని గుర్తించి ముందస్తుగా బైండోవర్‌ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి దాకా 1500 మందిని బైండోవర్‌ చేశారు. వీరిలో రౌడీషీటర్లకు, నేర చరిత్ర కలిగిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు.స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్ట భద్రతమరోవైపు నరసరావుపేట మండల పరిధిలోని కాకాని వద్ద జెఎన్‌టియు కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు, ఆర్మీ, సివిల్‌ పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. 24 గంటలూ నిరంతర సిసి కెమెరాల నిఘా, ప్రత్యేక సాయుధ బలగాల పహారా ఏర్పాట్లు చేస్తున్నారు. స్ట్రాంగ్‌ రూంల భద్రతను ఎస్పీ మలికా గార్గ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకూ అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.

➡️