26 నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ హిమాన్షుశుక్లా, పాల్గొన్న జెసి

ప్రజాశక్తి-అమలాపురం

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఈనెల 26వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 10 వరకు సచివాలయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఐదు దశలలో, ఐదు క్రీడాంశాలలో విజయవంతంగా నిర్వహించి క్రీడా ప్రతిభను చాటుతూ జాతీయ స్థాయిలో ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆడుదాం ఆంధ్రా క్రీడ పోటీల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి జిల్లా కలెక్టర్లకు జాయింట్‌ కలెక్టర్లకు క్రీడా ప్రాధికార సంస్థ, నోడల్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరె న్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 26 నాటికి ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీ నిర్వహణకు సర్వ సన్నద్ధం కావాలని ఆదేశించారు. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌,కబడ్డీ కోకో, క్రీడాంశాల నిర్వహణకు సంబంధించి సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నిర్దేశిత మార్గద ర్శకాలు అనుగుణంగా క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌ టీంలు ఎంపిక, మ్యాచ్‌ ఇన్చార్జిల నియామకం వంటి ప్రక్రియలను పూర్తి చేసి ఈనెల 26 నాటికి క్రీడా ప్రాంగణాలను అన్ని రకాలుగా సిద్ధపరచాలని సూచించారు. జిల్లాలో నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 90 శాతం రిజిస్ట్రేషన్‌ జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జెసి ఎస్‌.నుపూర్‌ అజరు, క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య శిక్షకులు సురేష్‌ కుమార్‌, నోడల్‌ అధికారి కె.భీమేశ్వరరావు, సిపిఒ వెంకటేశ్వర్లు, వక్ఫ్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️