26 నుంచి మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Dec 23,2023 21:36

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : ఈ నెల 26 నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ తెలిపారు. శనివారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్‌ కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ పాదయాత్రలో, అసెంబ్లీలో మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని హామీనిచ్చారని గుర్తుచేశారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా నేటికీ అమలు చేయలేదని చెప్పారు. మంత్రులకు, అధికారులకు అనేక పర్యాయాలు వినతి పత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. అయినా ఫలితం లేకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతున్నట్లు చెప్పారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు ఎన్‌.శంకర్రావు, సిహెచ్‌.సింహాచలం, మామిడి శివ, ఎన్‌.మల్లేష్‌, బంగారు రవి, నిర్మల, ఎం.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

➡️