29 బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటు

Mar 15,2024 21:02

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ :  జిల్లాలో 29 బిఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని బిఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ (శ్రీకాకుళం) జి.ఆడమ్‌ అన్నారు. శుక్రవారం స్థానిక బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినియోగదారుల అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆడమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జిఎం మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటి సారిగా వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 4జి సేవలను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఫైబర్‌, ఎఫ్‌టిటిహెచ్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను కూడా మొదలుపెట్టడం జరిగిందని వివరించారు. జిల్లాలో బ్రాడ్‌ బ్యాండ్‌ 43, ఫైబర్‌ కనెక్షన్లు 401ఉన్నాయన్నారు. వెండర్స్‌ ద్వారా ఈ సేవలను వినియోగదారులకు అందిస్తున్నా మన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ అతి తక్కువ ధరలో ప్లాన్లు లభ్యమవుతున్నాయని, దీన్ని వినియోగించు కోవాలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని నెట్‌వర్క్‌ల కన్నా బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ వర్క్‌ బాగా పని చేస్తోందన్నారు. ప్రతి వినియోగదారునికి నాణ్యమైన సేవలందించాలని, నెట్‌వర్క్‌లో సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని రిటైలర్స్‌కు సూచించారు. ఎయిర్‌ ఫైబర్‌ లాంటి ఆధునిక సేవలను బిఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తోందని ప్రతీ ఫ్రాంచైస్‌ ప్రజలకు అవగాహనా కల్పించాలని కోరారు. పార్వతీపురం నెట్‌ వర్క్‌ పరిధిలో ల్యాండ్‌ లైన్స్‌ 2889, బ్రాడ్‌ బ్యాండ్‌ 354, ఎఫ్‌.టి.టి.హెచ్‌.5856, ప్రీపెయిడ్‌ కనెక్షన్లు 217589 ఉన్నాయని, వాటి సంఖ్య మరింత పెరగాలని రిటైలర్లకు సూచించారు. కొత్తగా డు నాట్‌ డిస్టర్బ్‌ (డిఎన్‌డి) సేవలను కూడా ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా రిటైలర్స్‌, ఫ్రాంచెస్‌ సిబ్బందికి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా విధివిధానాలపై అవగాహనా కల్పించారు. కార్యక్రమంలో విజయనగరం, శ్రీకాకుళం డిజిఎంలు దాలి నాయుడు, మర్రి నాయుడు, పార్వతీపురం, శ్రీకాకుళం ఎజిఎంలు సురేష్‌, తేజేశ్వరరావు, కాగ్‌ మెంబెర్‌ చిట్టి బాబు, బిస్‌ఎన్‌ఎల్‌ రిటైలర్స్‌, వినియోగదారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️