3వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

నరసరావుపేట శిబిరంలో చెవిలో పూలతో కార్మికుల నిరసన
ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట :
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె గురువారం 3వ రోజుకు చేరుకుంది. గుంటూరు, నరసరావుపేట సమ్మె శిబిరాల్లో కార్మికులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని కెవిపిఎస్‌ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, కౌలురైతు సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షులు కె.రామారావు, ఎ.ప్రసాదరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్‌ సమయంలో మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల్ని పొగడ్తలతో ముంచెత్తిన పాలకులు ఆ తర్వాత వారి సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవట్లేదన్నారు. మున్సిపల్‌ కార్మికుల్లో 70 శాతానికి పైగా పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని, వారిని మోసం చేయడం దారుణమని అన్నారు. పట్టణాలను శుభ్రంగా ఉంచటానికి తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న వారికి తగిన వేతనాలు లేకపోవటం అత్యంత బాధాకరమన్నారు. అవుట్సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తా అని హామీ ఇచ్చి, నాలుగున్నరేళ్లవుతున్నా అమలు చేయకపోవడం సరికాదన్నారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగించాలని, కార్మికులకు సిపిఎం, ప్రజా సంఘాలు అండగా ఉంటాయని పిలుపునిచ్చారు. గుంటూరు సమ్మెలో ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఇంజినీరింగ్‌ విభాగం కన్వీనర్‌ పి.శ్రీనివాసరావు, పి.పూర్ణచంద్రరావు, యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు శివయ్య, కె.భాగ్యరాజు, వెహికల్‌ షెడ్‌ విభాగం కార్యదర్శి వై.ప్రభుదాసు నాయకులు కె.మరియదాసు, జి.శ్రీనివాసరావు, ఝాన్సీ, కె.సౌరమ్మ, సుజాత, రోశమ్మ, కార్మికుల పాల్గొన్నారు. నరసరావుపేటలో యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు సిలార్‌ మసూద్‌, కార్యదర్శి ఎ.సాల్మన్‌, జీవరత్నం, జయరాజు, డి.యోహాను, మల్లయ్య పాల్గొన్నారు.

➡️