3వ రోజు మరింత ఉధృతం

Dec 14,2023 22:52
పగులగొట్టి చట్ట

ప్రజాశక్తి – యంత్రాంగం

తమ దీర్ఘకాలిక సమస్యలపై అంగన్‌వాడీలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారిని రెచ్చకొట్టే చర్యలకు పాల్పడుతోంది. అంగన్‌వాడీల సమ్మెకు ముందు ప్రభుత్వం చర్చలకు పిలిచి సమ్మె చేస్తే ఉద్యోగాల నుంచి పీకేస్తామని హెచ్చరించింది. అయినా అంగన్‌వాడీలు ప్రభుత్వ హెచ్చరికలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో సమ్మెకు శ్రీకారం చుట్టారు. మూడో రోజైన గురవారం ప్రభుత్వ మొండివైఖరిపై మోకాళ్లపై నిల్చుని, కళ్లకు గంతలకు కట్టుకుని నిరసన తెలిపారు. కాకినాడ కాకినాడ అర్బన్‌లో జరుగుతున్న సమ్మె శిబిరాన్ని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి మిద్దె రమణమ్మ ప్రారంభించారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబీరాణి పాల్గొని మాట్లాడారు. కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని చూడడం దారుణం అన్నారు. తెలంగాణ కంటే రూ.1000 వేతనం అదనంగా ఇస్తామన్నా హామీని అమలు చేయాలని కోరుతుంటే సిఎం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. సమ్మె ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. యూనియన్‌ నాయకత్వంతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించకుండా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. సిఐటియు అనుబంధ సంఘాలన్నీ మద్దతుగా నిలబడతాయన్నారు. కాకినాడ అర్బన్‌ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, జనసేన నేతలు సమ్మెనుద్దేశించి మాట్లాడారు. జగ్గంపేట రూరల్‌ స్థానిక పంచాయతీ అథిథి గృహం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ శిబిరానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు రత్నం, సుజాత, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాజులూరులో నిర్వహించిన సమ్మె శిబిరాన్ని ఉద్ధేశించి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పద్మ, ఇ.చంద్రావతి మాట్లాడారు. టిడిపి రామచంద్రపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌ పోలిశెట్టి చంద్రశేఖర్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. యూనియన్‌ నాయకులు వరలక్ష్మి, హనుమావతి, అన్నవరం, టిడిపి మండల అధ్యక్షులు పేపకాయల బాబ్జి పాల్గొన్నారు. ఏలేశ్వరం ప్రత్తిపాడు సెక్టార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ఆందోళనను కొనసాగించారు. కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెంలో అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను సచివాలయం, పంచాయితీ సిబ్బంది పగులకొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో సిఐటియు మండల కార్యదర్శి టి.రాజా, నాయకుడు సిహెచ్‌.విజయకుమార్‌ అడ్డుకున్నారు. ప్రభుత్వం చర్చలు జరిపి అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సెంటర్ల తాళాలు పగలగొట్టించడం దారుణమన్నారు. పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్లో అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన చేపట్టారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, పట్టణ టిడిపి అధ్యక్షులు రంది సత్యనారాయణ, నాయకులు సంఘీభావం తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎంఎస్‌సి.మూర్తి, మండల కార్యదర్శి కెనడీ నాయకులు, సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మద్దతు తెలిపారు. ఈ కారక్రమంలో దాడి బేబీ, నాగమణి, అమల, ఎస్తేరు రాణి, ఫాతిమా, తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి మండలంలో అంగన్‌వాడీలు నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా యూనియన్‌ మండల అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడారు. సెంటర్ల తాళాలను పగులకొట్టించడం దారుణమన్నారు. ఏలేశ్వరం ఐసిడిఎస్‌ సెక్టార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల సిఐటియు కార్యదర్శులు పాకలపాటి సోమరాజు, రొంగల ఈశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాకరపల్లి సునీత, కె.హేమలత, టి.నాగవరలక్ష్మి, మరియ, గంగాభవాని పాల్గొన్నారు. పెదపూడి స్థానిక ఎంపిడిఒ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్‌వాడీల ఆందోళన కార్యక్రమంలో ఐద్వా నాయకులు సిహెచ్‌.రమణి పాల్గొని మద్దతు తెలిపారు. మహిళా సాధికారికతే ధ్యేయం అని చెబుతున్న ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎం. రాజేశ్వరి, వి.భారతి, టి.వేణు, ఎ.కనకదుర్గ పాల్గొన్నారు. పిఠాపురం ఐసిసెస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీల నిరసన శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి డి.తులసి, సిఐటియు నాయకులు కె.చిన్న మాట్లాడారు. జెవివి నాయకులు ఎన్‌.సూర్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.విశ్వనాథం. అంగన్‌వాడీ యూనియన్‌ నాయకలు కె. సత్యవతి, బేబీరాణి, విజయ శాంత, తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల డిమాండ్లు నెరవేర్చాలి : సిపిఎం

అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎం కాకినాడ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంగన్‌వాడీల సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రభుత్వ విచ్ఛిన్నకర ఎత్తుగడలను ఎదుర్కొని కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా నిలబడాలని, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల తరగతుల ప్రజలు, ప్రజాతంత్రవాదులు అంగన్‌వాడీలకు సంఘీభావంగా నిలబడాలని కోరారు. నాలుగేళ్లుగా హామీలు అమలు చేయాలని కోరినా ఫలితం లేదన్నారు. దీంతో చివరకు వారు సమ్మెకు దిగారని తెలిపారు. ఈ సమ్మెను నివారించే అవకాశం ఉన్నా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాలో అనేక చోట్ల ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు అంగన్‌వాడీల కేంద్రాల తాళాలు పగులగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నారని, దీనిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

➡️