39వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

39వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం తమ డిమాండ్లు నెరవేర్చాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 39వ రోజుకు చేరింది. పలుచోట్ల 24 గంటల రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పలు ప్రజా సంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపారు. రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి గోకవరం బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందించారు. సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సుందర బాబు, బి.రాజులోవ, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.మాణిక్యాంబ, కె.బేబిరాణి మాట్లాడారు. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాజ్యాంగం ప్రకారం అంగన్‌వాడీలకు కనీస వేతనాలు ఎందుకు అమలు చేయరని వారు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీలు 39 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. ఎన్నికల ముందు ఓట్లు కోసం ఎన్నో హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలు అయిపోయాక సమస్యలు వినే తీరికి కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీల 24 గంటల దీక్షకు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.అరుణ కుమారి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.జయకర్‌, ఎ.షరీఫ్‌, కోశాధికారి ఇవిఎస్‌ఆర్‌.ప్రసాద్‌, జిల్లా కార్యదర్శులు ఎన్‌.రవిబాబు, రమేష్‌బాబు, దయానిధి, ఎఐటియుసి సీనియర్‌ నాయకులు నల్లా రామారావు, ఐఎఫ్‌టియు జిల్లా నాయకులు కె.జోజి, కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముళ్ల మాధవ్‌, టిఎన్‌టియుసి రాష్ట్ర కార్యనిర్వాహక తీడా ఆదిబాబు, నాయకులు నీలి కిషోర్‌ మద్దతు తెలిపారు.దేవరపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద శిబిరంలో ఒంటి కాలిపైన నిలబడి అంగన్‌వాడీలు నిరసన తెలిపారు. టిపి.లక్ష్మి మాట్లాడారు. సమ్మెకు యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు హుస్సే శంకరుడు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.పద్మ, కామేశ్వరి, కె.కుమారి, కె.వరలక్ష్మి, ఎస్‌కె.గౌస్య, కె.మంజు పాల్గొన్నారు.చాగల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె శిబిరంలో యూనియన్‌ నాయకులు పి.విజయ కుమారి, కె.లక్ష్మి మాట్లాడారు. అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు కడియం అంగన్వాడీల నిరవధిక సమ్మెకు రాజమహేంద్రవరం రూరల్‌ కాంగ్రెస్‌ నాయకులు జెటి.రామారావు సంఘీభావం తెలిపారు. సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు.

➡️