80 కిలోల గంజాయి స్వాధీనం

Feb 2,2024 22:57

ప్ర‌జాశ‌క్తి – మంగళగిరి రూరల్ ః రెండు కారుల్లో అక్రమంగా తరలిస్తున్న 80కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సెబ్ డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళగిరి -తాడేపల్లి కార్పొరేషన్ పరిధి నవులూరు సెబ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. వైజాగ్ నుంచి తిరుపతి కి రెండు కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు సెబ్ అధికారులు సమాచారం అందుకున్నారు. ఈ నేపధ్యంలో కాజ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. రెండు కార్లలో గంజాయిని తరలిస్తున్న తిరుపతి కి చెందిన మన్నెం బత్తయ్య, పసుపులేటి గిరిబాబు, ఎట్టి కుప్పం మునిబాలి రెడ్డి , పాకాల రాజశేఖర్ అనే నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 80కేజీల గంజాయితో పాటు రవాణాకు వినియోగించిన రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లతో పాటు రూ.13,590నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో సెబ్ సీఐ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️