9వ రోజుకు మున్సిపల్‌ కార్మికుల సమ్మె

మున్సిపల్‌ కార్మికుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం 9వ రోజుకు చేరుకుంది. పెద్దాపురం మున్సిపల్‌ సెంటర్‌లోని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెస్తామంటూ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పని చేసే కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇస్తానన్న మాట ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదన్నారు. కార్మికులను పర్మినెంట్‌ చేస్తారని అన్నమాట మరచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శివకోటి అప్పారావు, సింగంపల్లి సింహాచలం, శ్రీను, వేలాపు శివ, వర్రే భవాని, ముత్యాల సత్యనారాయణ, వర్రే కుమారి, నాగ దుర్గ, బంగారు సూరిబాబు, తడారి భవాని, నేలపు నూకరత్నం, సేలం శ్రీను, గంటా రమణ, ఇసరపు ప్రసాద్‌, శ్రీకాంత్‌, శేషారావు, వర్రే నాగ దుర్గారావు, వర్రే రాజేష్‌, సింగంపల్లి శివ, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.సామర్లకోట రూరల్‌ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించుకుంటే మున్సిపల్‌ కార్మికుల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ హెచ్చరించారు. ఉదయం నుండి పనులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొన్నారు, మున్సిపల్‌ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసి మహిళా కార్మికులు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నారు, ఈ దీక్ష శిబిరాన్ని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి మున్సిపల్‌ కార్మికులు పనులు చేస్తుంటే వారి న్యాయమైన కోరికలను తీర్చకుండా చర్చలు జరిపినా అవి పూర్తిగా సఫలం కాకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ దీక్షలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, పట్టణ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ, ఎలిసెట్టి రామదాసు ప్రజానాట్యమండలి కళాకారులు మడగల రమణ, పెదిరెడ్ల అర్జున్‌ రావు, సప్ప సూరిబాబు, ఆడపా చిట్టిబాబు, యూనియన్‌ నాయకులు బచ్చా శ్రీను, కిషోర్‌ పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ రామారావుకు నాయకులు వినతిపత్రం అందజేశారు.పిఠాపురం (గొల్లప్రోలు) గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం నుంచి కార్మికులు ఎంపిడిఒ కార్యాలయం వరకు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె.విశ్వనాథం, శానిటేషన్‌ వర్కర్స్‌ నాయకులు బి.సత్యవతి, రమణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మున్సిపల్‌ యూనియన్‌ సిఐటియు నాయకులతో సమస్యలపై చర్చించిందన్నారు. ఈ చర్చల్లో క్లాప్‌ డైవర్లకు అండర్‌ డ్రైనేజీ వర్కర్స్‌కు పార్కులో పని చేసే వారికి హెల్త్‌ అలవెన్స్‌ మంజూరు చేస్తామని సర్క్యులర్‌ జారీ చేశారని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని, కార్మికులను పర్మినెంట్‌ చేస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏసమ్మ, రాజ్‌ మోహన్‌, రామారావు, రాజు, భానుప్రసాద్‌, కుమారి, దివ్యవాణి, సతీష్‌ లోవబాబు, సింహాచలం పాల్గొన్నారు.

➡️