90శాతం హామీలు అమలు : ఎమ్మెల్యే

Mar 15,2024 21:28

 ప్రజాశక్తి – కురుపాం : ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 99 శాతం హామీలు పూర్తి చేశారని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలో ధూళికేశ్వర ఆలయ సమీప మైదానం వద్ద ఎంపిడిఒ ఎస్‌.అప్పారావు అధ్యక్షతన జరిగిన వైయస్సార్‌ చేయూత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచివాలయం, వాలంటరీ వ్యవస్థ పెట్టి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందించి పాలన అందిస్తున్నారని అన్నారు. కావున వైసిపి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం 3357 మంది లబ్ధిదారులకు రూ.6 కోట్ల 29,43,750 చెక్కను మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపిపి శెట్టి పద్మావతి, జడ్పిటిసి జి.సుజాత, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ నిషార్‌, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జిలానీ, ఎపిఎం ఇవి కిషోర్‌, మండల కన్వీనర్‌ ఐ.గౌరీశంకర్‌, గ్రీవెన్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు శెట్టి నాగేశ్వరరావు, వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటేశ్వరరావు, సచివాలయ, వైకెసి సిబ్బంది, వాలంటీర్లు, మండలంలో గల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, కార్పొరేషన్‌ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.పిఎంఎంఎస్‌వైను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జియ్యమ్మవలస : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రైతులకు చేపల రవాణా చేసుకొనేందుకు నాలుగు చక్రాల లైవ్‌ షిప్‌ రవాణా వాహనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై ఆర్థిక సహాయాన్ని అదించి ఆదుకుంటుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కోరారు. శుక్రవారం చినమేరంగిలో తన నివాసంలో ఆ శాఖ డిఎఫ్‌ఒ వి.తిరుపతయ్య ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం సుందరయ్య కాలనీకి చెందిన భత్తుల సాయి పవన్‌కు కొత్త వాహనాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఇందులో యూనిట్‌ విలువ రూ.13 లక్షల 29,798 కాగా, బిసి రైతులకు రాయితీపై రూ.5 లక్షల 3192 రూపాయలు, లబ్ధిదారుల వాటా రూ.2లక్షల 65 958 రూపాయిలు ఇందులో బ్యాంకు రుణం కింద 5లక్షల 31920 ఇస్తున్నట్లు డిఎఫ్‌ఒ తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డిఓ గోపాలకృష్ణ, ఈశ్వర రాజు, మత్స్య సహాయకారులు రాయుడు, సురేష్‌, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.

➡️