Mar 4,2024 22:00

64 సర్క్యులర్‌ను రద్దు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట వీఓఏల ధర్నా
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వీఓఏలకు ప్రమాదకరమైన సర్క్యులర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద భారీ ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ వెలుగు యానిమేటర్స్‌ ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఓఏలకు మూడు సంవత్సరాల కాలపరిమితి పెడుతూ సర్క్యులర్‌ 64 తీసుకురావడం దుర్మార్గమని, వెంటనే రద్దు చేయాలని గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. గత నెల చలో విజయవాడలో 36 గంటల పాటు ధర్నా కార్యక్రమం సందర్భంగా సెర్ఫ్‌ అధికారులు యూనియన్‌ నాయకులతో చర్చలు జరుపుతూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేయకుండానే అధికారులు ఇతర డిపార్ట్మెంట్లకు వెళ్లిపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద వీవోఏలకు ప్రమాదకరమైన 64 సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని, జెండర్‌ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జీను రాజశేఖర్‌, నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ధర్నాలో వీవోఏల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, కోశాధికారి గిరిజ, నాయకులు మంగమ్మ, శేషాద్రి, మునస్వామి, కళావతి, రేఖ, రామ, సుబ్బారెడ్డి, పెద్ద సంఖ్యలో వీవోఏలు పాల్గొన్నారు.

➡️