అన్న క్యాంటీన్ల పున:ప్రారంభానికి చర్యలు : జెసి

Jun 18,2024 23:20

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : అన్న క్యాంటీన్ల పున:ప్రారంభానికి తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ కమిషనర్లను పల్నాడు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ నుండి జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌, పురపాలక సంఘాల ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ల పునర్‌ వ్యవస్థీకరణ కోసం చర్యలు తీసుకోవడంతోపాటు మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. అన్న క్యాంటీన్ల తాజా పరిస్థితికి అందుకు అనుగుణంగా చేపట్టాల్సిన పనులపై నివేదిక రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన శాఖకు అందజేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్లు వివరాలు చెప్పడంతోపాటు వాటి పునర్‌వ్యవస్థీకరణ కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

➡️