నేటి నుండి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 24,2024 00:17

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో నేటి నుండి పదో తరగతి, ఇంటర్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల విడుదలైన టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు, బెటర్‌మెంట్‌ పరీక్షలు రాసే వారు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలకు 6,373 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూన్‌ 3వ తేదీ వరకూ జరుగుతాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 17,776 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తారు.

➡️